
గ్రామీణ వైద్యుల గుర్తింపునకు కృషి
కర్నూలు (హాస్పిటల్): గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్ధన్ చెప్పారు. స్థానిక కృష్ణా నగర్‌లోని బిర్లాగేట్ వద్ద ఉన్న లక్ష్మీ కళ్యాణ మండపంలో బుధవారం ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యుల మహాసభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి టీజీ భరత్, టీడీ జనార్ధన్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆర్‌ఎంపీల సేవలు ఉపయోగించుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ.. వైద్యుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామీణ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి సమస్యలపై మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శి ఎంఎన్ రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పర్ల దస్తగిరి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.