
9 నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
కర్నూలు(సెంట్రల్): సీపీఐ 24వ జిల్లా మహాసభలను ఆగస్టు 9, 10, 11 తేదీల్లో కర్నూలులో నిర్వహించనున్నట్లు మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కె.జగన్నాథం, ట్రెజరర్ ఎస్.మునెప్ప తెలిపారు. స్థానిక సీఆర్ భవన్‌లో బుధవారం ఉదయం 11 గంటలకు మహాసభల కరపత్రాలను సీపీఐ నాయకులు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ దేశ స్వాతంత్య్రం కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక కుట్రలను ఎదుర్కొని పోరాటాలు చేసిందన్నారు. భూపోరాటాలు చేసి పేదలకు గూడు కోసం ఉద్యమించిన ఘన చరిత్ర పార్టీకి ఉందన్నారు. కర్నూలులో జిల్లాలోనూ ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పారు. జిల్లా మహాసభల్లో భాగంగా మొదటి రోజు వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. మహాసభల విజయవంతానికి పార్టీ శ్రేయోభిలాషులు, పెద్దలు, దాతలు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. నగర సహాయ కార్యదర్శులు మహేష్, శ్రీనివాసరావు, జి.చంద్రశేఖర్, నాయకులు బీసన్న, నల్లన్న, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.