
అక్రమంగా తరలిస్తున్న రూ.37.9 లక్షలు పట్టివేత
డోన్ టౌన్: ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.37.9 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పట్టణ సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ, రూరల్ సీఐలు ఇంతియాజ్‌బాషా, సీఎం రాకేష్ వివరాలు వెల్లడించారు. మంగళవారం తెల్లవారు జామున పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. కర్నూలు వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అన్వర్ అనే వ్యక్తి వద్ద రూ. 37.9 లక్షల నగదు లభించింది. పోలీసులు ఆరా తీయగా వ్యాపారం నిమిత్తం నగదుతో బెంగళూరు వెళుతున్నట్లు తెలిపినా, నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూప లేదు. దీంతో నగదును స్వాధీనం చేసుకోని సీజ్ చేసినట్లు సీఐలు తెలిపారు. వ్యాపారి నగదుకు సరైన రుజువులు చూపిస్తే తిరిగి ఇచ్చేస్తామని, లేదంటే ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు అప్పగిస్తామన్నారు. తనిఖీల్లో పట్టణ, రూరల్ ఎస్‌ఐలు శరత్‌కుమార్ రెడ్డి, మమత, సిబ్బంది పాల్గొన్నారు.