
శుభంకరి..శాకంబరీ
● ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని నేడు శాకంబరీ ఉత్సవం
శ్రీశైలంటెంపుల్: మహాక్షేత్రంలో ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి రోజున శాకంబరీ ఉత్సవం ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవంలో అమ్మ వారి మూలమూర్తిని పలు రకాల ఆకుకూరలు, కూరగాయాలు, ఫలాలతో అలంకరిస్తారు. శాకాలంకరిణి అయిన అమ్మవారి దర్శనంతో భక్తులు పులకించి పోతారు. ఈ ఉత్సవం రోజు న అమ్మవారి ఉత్సవ మూర్తిని, ఆలయ ప్రాంగాణంలోని రాజరాజేశ్వరీ అమ్మవారిని, సప్తమాతృకలను, గ్రామదేవత అంకాళమ్మను కూడా వివిధ రకాల కూరగాయలతో అలంకరించి విశేషపూజలు జరిపిస్తారు. ఇందుకోసం మూడు వేల కేజీలకు పైగా వివిధ రకాల కూరగాయలు, 100 గుమ్మడికాయలు, 2 వేలకు పైగా నిమ్మకాయలు, 600 వివిధ రకాల అకుకూర కట్టలు, వివిధ రకాల ఫలాలను తెప్పించారు. బుధవారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగాణాన్ని వివిధ రకాల కూరగాయలు, అకుకూరలతో అలంకరించారు. శాకంబరీ ఉత్సవం రోజున భ్రమరాంబాదేవి వారిని దర్శించడంతో దారిద్య్రం తొలగి, సిరిసంపదలు కలుగుతాయని, ముఖ్యంగా పాడిపంటలకు లోటుండదని భక్తుల విశ్వాసం.
ఆకలి తీర్చిన శాకంబరీ
పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గమడు అనే రాక్షసుడు తన తపశక్తితో వేదాలను అంతర్థానం చేశాడు. దాంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. ఈ కారణంగా కరువు కాటకాలతో తీవ్రమైన క్షామం ఏర్పడింది. అప్పుడు మహర్హులందరూ గొప్ప తపస్సు చేశారు. ఆ తపస్సుకు పరిశక్తి ప్రసన్నురాలై లోకరక్షణకోసం దుర్గముడిని సంహరించి, వేదాలను రక్షించి, వైదికకర్మలను పునరుద్ధరించారు. ఆ సందర్భంలోనే జగన్మాత తన నుంచి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, ఫలాలు మొదలైన వాటిని సృష్టించి జీవుల ఆకలి తీర్చారు.