
మధ్యవర్తిత్వంతో త్వరితగతిన కేసుల పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వంతో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు వెసులుబాటు లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి/జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు జి.కబర్ది అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవా సదన్‌లో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన న్యాయవాదులు, ఎన్‌జీఓలకు ఒక్కరోజు వర్క్ షాపు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులు విచారణ వరకు వెళ్లకుండా త్వరగా పరిష్కారం అవుతాయన్నా రు. రానున్న 90 రోజులపాటు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించేందుకు అన్ని కోర్టుల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అనుజ సక్సేనా, నీనా కరే న్యాయవాదులకు, ఎన్‌జీఓలకు శిక్షణ ఇచ్చారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వం అన్నారు. దీనివల్ల కోర్టుల్లో కేసులు విచారణకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసో సియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి పాల్గొన్నారు.