
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసం
కర్నూలు: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసం చేసిన నెల్లూరు జిల్లాకు చెందిన పోతురాజు రతన్ కుమార్, పాలకీర్తి జశ్వంత్, పోతురాజు శాంతి పవన్‌కుమార్, కట్ట శ్రీకాంత్ అలియాస్ విశ్వనాథ్‌లను కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పట్టణం సూర్యరావుపేట భద్ర హైట్స్ ఫ్లాట్ నెం.105లో నివాసముంటున్న డాక్టర్ రాజేంద్రప్రసాద్ కర్నూలులోని పావని లాడ్జిలో ఉండగా తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని చెప్పి రూ.7.32 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఈ మేరకు ఇచ్చిన ఫిర్యాదుతో మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలతో నిందితులను అరెస్టు చేసి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. సీఐలు శేషయ్య, నాగశేఖర్, ఎస్‌ఐ బాలనరసింహులుతో కలసి డీఎస్పీ బాబు ప్రసాద్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు. వీరి నుంచి రూ.6.40 లక్షల నగదు, నాలుగు కార్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, పోలీసులు వాడే సామగ్రితో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ముఠాకు ప్రధాన సూత్రధారులైన దేవరకొండ సుధీర్, పీటర్ పాల్, శివకుమార్‌రెడ్డిలు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు.
ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు