
సైకిల్‌పై నుంచి కింద పడి విద్యార్థి మృతి
కోవెలకుంట్ల: స్థానిక సంతపేటకు చెందిన ఓ విద్యార్థి సోమవారం రాత్రి సైకిల్‌పై నుంచి కింద పడి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన చాకలి మధుసూదన్, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. రజకవృత్తి చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చిన్నకుమారుడు చరణ్(11) పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. రాత్రి ఇంటి వద్ద సైకిల్ తొక్కుతూ కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన చుట్టుపక్కలి వారు చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్య సిబ్బంది నంద్యాలకు తీసుకెళ్లాలని సూచించారు. మెరుగైన వైద్యం కోసం తరలించే లోపే మృతి చెందటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సైకిల్ తొక్కుతూ కింద పడి తలకు బలమైన గాయమై మృతి చెందాడా, కింద పడటంతో భయానికి గురై మృత్యువాత పడ్డాడా అని కాలనీవాసులు చర్చించుకుంటున్నారు.