
839 మంది మహిళా పోలీసులకు స్థానచలనం
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 839 మంది గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులకు స్థానచలనం కలిగింది. ర్యాంకింగ్ ఆధారంగా మహిళా పోలీసులను బదిలీ చేశారు. కౌన్సిలింగ్ నిర్వహించారు. కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం సచివాలయ మహిళా పోలీసులకు బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ దగ్గరుండి పర్యవేక్షించారు. మొత్తం 839 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. ర్యాంకింగ్ ఆధారంగా ఖాళీ ఉన్న సచివాలయాల ఆప్షన్లను కంప్యూటర్ తెరపై చూపి కోరుకున్న స్థానానికి బదిలీ చేశారు. దృష్టి లోపం, అంధత్వం ఉన్నవారికి (విజువల్ ఛాలెంజ్), మేధో వైకల్యం (మెంటల్లీ డిసేబుల్డ్), ట్రైబ్స్ దివ్యాంగులు, మెడికల్, స్పౌజ్, జనరల్ కేటగిరీల కింద ఉన్నవారిని వరుస క్రమంలో వ్యాస్ ఆడిటోరియంలోకి పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కంప్యూటర్ తెరపై ప్రదర్శించిన ఆప్షన్లకు అనుగుణంగా కోరుకున్న స్థానానికి నియమించారు. బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ జులై 1న పింఛన్ల పంపిణీ ఉన్నందున ఎక్కడివారు అక్కడే ఉండాలని పోలీసు అధికారులు తెలిపారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యేవరకు అక్కడే కొనసాగి కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బదిలీ ప్రొసీడింగ్స్ విడుదల చేస్తామన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, మహిళా పీఎస్ డీఎస్పీ శ్రీనివాసాచారి, పోలీస్ వెల్ఫేర్ డాక్టర్ స్రవంతి, సీఐలు తేజమూర్తి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.
‘కౌన్సెలింగ్’ పాట్లు!
ఆదోనికి చెందిన లక్ష్మీదేవి మహిళా పోలీస్‌గా పనిచేస్తోంది. ఆరు నెలలుగా మెటర్నిటీ లీవ్‌లో ఉంది. మూడు రోజుల కిందట శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఇదే సమయంలో శనివారం సచివాలయ ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తుండటంతో ఏకంగా తన చంటిబిడ్డను తీసుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సెలింగ్‌కు హాజరైంది. అలాగే మరికొంత మంది కడుపుతో ఉన్న ఉద్యోగినులు, ఇంకొందరు చంటిబిడ్డలతో వచ్చి అక్కడే ఊయలలు కట్టిన దృశ్యాలు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద చర్చనీయాంశమయ్యాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సాఫీగా సాగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో ఉద్యోగులకు అవస్థలు తప్పడంలేదు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు