
దర్శనం దందా!
అమాయక భక్తులు దొరికితే చాలు.. ఇక్కడి దళారులకు పండగే. అడ్డదారుల్లో దర్శనాలు చేయించి అందినకాడికి దోచుకోవడం వీరికి అలవాటే. ఏకంగా శ్రీ మఠం అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తుండటం ఆశ్చర్యకరం. ఇంతటి అపచారం రాఘవేంద్రుని సన్నిధిలో కొంతకాలంగా జరుగుతుండటం మహా అపచారం. – మంత్రాలయం
● దర్శనం పేరుతో భక్తులకు గాలం
● అడ్డదారుల్లో జేబులు నింపుకుంటున్న దళారులు
● ఆలస్యంగా మేలుకున్న శ్రీ మఠం అధికారులు
మంత్రాలయం ఆధ్యాత్మిక క్షేత్రం ఎంతో పేరెన్నిక గన్నది. ఇక్కడ కొలువుదీరిన శ్రీరాఘవేంద్రస్వామి, గ్రామ దేవత మంచాలమ్మలను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దీనినే ఆసరాగా చేసుకున్న కొంత మంది దళారులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో కొంత మంది ప్రైవేటు వసతి గృహాలను లీజుకు నడుపుతున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో గదులు కేటాయించే సమయంలో గదుల అద్దెతో పాటు దర్శన సౌకర్యం, పరిమళ ప్రసాదం ప్యాకేజీగా మాట్లాడుకుంటున్నారు. సాధారణ రోజుల కంటే బుధ, గురు, శని, ఆది వారాల్లో లక్షకు పైగా భక్తులు మంత్రాలయం దర్శన నిమిత్తం వస్తుంటారు. తమ వసతి గృహాల్లో బస చేసిన వారు శ్రీ మఠం చేరుకోగానే 6, 7 గేటు నెంబర్ల వద్దకు వెళ్లి మన వారే అంటే చాలు క్షణాల్లో దర్శనం అయిపోతుంది. సాధారణ భక్తులకు మాత్రం గంటల కొద్ది సమయం పడుతుంది. అంతేగాకుండా ఇక్కడ లభించే పరిమళ ప్రసాదం తరహాలోనే కొంత మంది వ్యాపారులు కొన్ని రకాల మిఠాయిలను తయారు చేసి ప్రసాదం పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. ఈ తంతు ఇటీవల కాలంలో శ్రీ మఠం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది.
ఆలస్యంగా స్పందించిన అధికారులు
శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో స్వామి వారి దర్శన దందా బాగోతంపై శ్రీ మఠం అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు, శ్రీపతి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక క్యూలైన్‌లో ఏర్పాటు చేశామని, ఎవ్వరూ కూడా డబ్బు కట్టి మోసపోవద్దని మైకుల ద్వా రా సూచనలు చేయించినట్లు తెలిపారు. ఎవరైనా డబ్బు వసూలు చేసినట్‌లైతే తమ దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పరిమళ ప్రసాదం తరహాలోనే ప్రసాద విక్రయాలు జరుగుతున్నాయని తమ దృష్టికి రాగానే విజిలెన్స్ విభాగం వారు తనిఖీలు చేపట్టి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇక మీదట ఎవరైనా నకిలీ పరిమళ ప్రసాదం విక్రయిస్తే షాపు లీజు రద్దు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దర్శనం దందా!