కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలకు బదిలీలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయాల్లో అన్ని కేటగిరిలకు బదిలీలను ర్యాంకు ఆధారంగా చేస్తుండగా వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్‌ను ఎలా తీసుకుంటారని దాదాపు 30 మందికి పైగా ఏఎన్‌ఎంలు శనివారం వారి అభ్యంతరాలను కార్యాలయ అధికారులకు అందజేశారు.
తాజా జాబితాలోనూ ర్యాంకు ఎక్కువగా ఉన్న వారు పై భాగాన ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఏఎన్‌ఎంలకు 2019 అక్టోబర్ 2న జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని, ఆ రోజున గాంధీ జయంతి ఉండటం వల్ల సెలవు అని, ఆ తేదీని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు విడుదల చేసిన జాబితాలోనూ పలు తప్పులు ఉన్నాయని, అధికారులు వీటిని సరిచేసి ర్యాంకు ఆధారంగా జాబితా తయారు చేసి కౌన్సెలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.
ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించాలి
నంద్యాల(న్యూటౌన్): ఆహార పదార్థాల తయారీలో నాణ్యత పాటించాలని ఫుట్‌సేఫ్టీ అధికారి వెంకటరాముడు హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లు, బజ్జీల బండ్ల నిర్వాహకులకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ కాచిన నూనెను మరలా కాయడం, కాలం చెల్లి న ఆహార పదార్థాలు వాడటం వంటి 8 కేసులకు సంబంధించి రూ.1.80 లక్షల అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. హోటల్, డాబాలలో కలర్స్, టేస్టింగ్ సాల్ట్ వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చిన్నారిపై కుక్కదాడి
కొత్తపల్లి: ఇంటి బయట ఉన్న 9 నెలల చిన్నారి పై కుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటన ముసలిమడుగు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు, చిన్నారి దంపతులు తమ తొమ్మిది నెలల కూతురిని ఇంటి బయట ఉన్న అరుగు వద్ద కూర్చోబెట్టి తల్లి ఇంట్లోకి వెళ్లిది. అంతలోనే ఓ కుక్క చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసింది. చెవికి, ముక్కుకు రక్తగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.