
తరగతుల విలీనంపై తల్లుల ఆందోళన
మంత్రాలయం రూరల్: ‘నిన్నటి వరకు మా పిల్లలు అక్కడే అక్షరాలు దిద్దారు. ఇప్పుడేమో ఆ పాఠశాలకు రావొద్దు అంటూ తిప్పి పంపుతున్నారు. దూరంగా ఉన్న పాఠశాలకు ఎలా పంపేది. కూలీ పనులకు చేసుకునే మేము పిల్లలను ఎలా చదివించుకోవాలి’ అంటూ విద్యార్థుల తల్లులు ఆందోళనకు దిగారు. పాఠశాల విలీనాన్ని రద్దు చేయాలని స్థానిక రామచంద్ర నగర్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లులు బుధవారం నిరసన తెలిపారు. ఈ పాఠశాలలో 80 మంది వరకు చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. టీచర్లను నియమించాల్సిన కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. కేవలం ఒక్క టీచర్ మాత్రమే పాఠశాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాఠశాలలోని 3 నుంచి 5 తరగతులను పాతూరులోని పాఠశాలకు మార్చారు. రోజూ తల్లిదండ్రులు రామచంద్ర నగర్ పాఠశాలకు పిల్లలను పంపుతున్నారు. అయితే ఇక్కడకు వచ్చిన విద్యార్థులను ఆ పాఠశాలకు తరలించడంపై పిల్లల తల్లులు బుధవారం రోడ్డెక్కారు. పాతూరు పాఠశాలకు తమ పిల్లలను పంపమంటూ ఆందోళనకు దిగారు. తమ పిల్లలను దూరంలో ఉన్న పాతూరు పాఠశాలకు పంపాలంటే రోడ్ల రద్దీతోపాటు, వాహనాల బెడద ఎక్కువగా ఉంటుందని వారు వాపోయారు. తమ పిల్లలకు 5వ తరగతి వరకు ఇక్కడే చదువులు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా కూటమి నేతలు సైతం ఆందోళనలో దర్శనమివ్వడం విశేషం.