మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తులాభారం వేడుక కనుల పండువగా సాగింది. బుధవారం కర్ణాకటలోని మాండ్యకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ దంపతులు మొక్కుబడిలో భాగంగా బియ్యం, బేడలు, బాదంతో తులాభారం చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలోని తులాభారం కౌంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇంగ్లిషులో మాట్లాడేలా తీర్చిదిద్దాలి
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సులభంగా తెలుగు మాట్లాడినట్లు ఇంగ్లిషులో కూడా మాట్లాడగలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని విల్ టు కేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లిషు ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ శామ్యూల్‌పాల్‌తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణకు జిల్లాలో దాదాపు 450 మంది ఆంగ్ల ఉపాధ్యాయులు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. వారికి ఇంగ్లిషు బోధనలో పలు మెళకువలు, సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. వాటి ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులను ఇంగ్లిషులో పూర్తి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విల్ టు కేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ ప్రతినిధులు వేణుగోపాల్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
బైక్ దొంగను పట్టుకుంటే.. బంగారు నగలు లభ్యం
సి.బెళగల్: స్కూటర్ ఎత్తుకెళ్లిన దొంగను పట్టుకుంటే... బంగారు నగలు లభించిన ఘటన మండల కేంద్రం సి.బెళగల్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. బుధవారం సి.బెళగల్ చెందిన కొందరు యువకులు గ్రామ శివారులోని కంబదహాల్ గ్రామ రోడ్డులో వ్యవసాయ పొలం దగ్గర తమ స్కూటర్లను నిలిపి పొలంలో ఉన్న ఉపరితల ట్యాంక్‌లో స్నానం చేస్తున్నారు. అయితే వారితో పాటు ఓ కొత్త యువకుడు సైతం ట్యాంక్‌లో స్నానం చేశాడు. కొద్ది సేపటికే ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు సి.బెళగల్‌కు చెందిన శివ స్కూటర్‌ను ఎత్తుకెళ్లాడు. అనుమానంతో సదరు యువకుడి కోసం గాలిస్తుండగా కంబదహాల్ సమీపంలో స్కూటర్‌తో కనిపించాడు.
వెంటనే ఆ యువకుడిని పట్టుకొని సి.బెళగల్‌లో పోలీసులకు అప్పగించేందుకు వెళ్తుండగా నిందితుడి దగ్గర బంగారు ఆభరణాలున్న ప్యాకెట్ గుర్తించారు. స్కూటర్‌తో పాటు బంగారు దొంగతనం బయటకు వస్తుందని భయపడి కొటారుమిట్ట దగ్గర ఉన్న వంకలోకి దూకాడు. నిందితుడిని వెంబడించిన స్థానికులు వంక నీటి నుంచి బయటకు లాగి పోలీసులకు అప్పగించారు. నిందితుడి దగ్గర దాదాపు ఏడు తులాల బంగారు, వెండి ఆభరణాలన్నాయి. అతడిని విచారిస్తున్నామని ఎస్‌ఐ పరమేష్‌నాయక్ తెలిపారు.

పీఠాధిపతికి తులాభారం