శ్రీశైలంప్రాజెక్ట్: చెంచు గిరిజనుల ఆర్థికాభివృద్ధికి వైకేపీ సిబ్బంది కృషి చేయాలని ఐటీడీఏ పీఓ రవీంద్రారెడ్డి అన్నారు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో ఏర్పాటు చేసే ప్రధానమంత్రి వందన వికాస్ కేంద్రాలపై శుక్రవారం శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వందన వికాస్ కేంద్రాలను అభివృద్ధి చేసి చెంచు గిరిజనులు స్వయం ఉపాధిలో రాణించే చూడాలన్నారు. గిరిజనుల అభ్యర్థన మేరకు నన్నారి నర్సరీలను ఏర్పాటు చేసి నాణ్యమైన మొక్కలను గిరిజన రైతులకు అందించాలన్నారు. వారి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలని తెలిపారు. చెంచుగూడేలలో ఇళ్లు, ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, వందన్‌బ్యాంక్ అకౌంట్ లేని వారి వివరాలను సేకరించి వారికి అవసరమైన వాటిని వైకేపీ అధికారులు, సిబ్బంది సమకూర్చాలని తెలిపారు. సమావేశంలో ఏపీఓ ఎ.సురేష్‌కుమార్, అధికారి బీసీ ధనుంజయ, మేనేజర్ బీవీ శేషగిరిరావు పాల్గొన్నారు.