
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిల్పారవి
నంద్యాల(వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ప్రధాన ప్రాత పోషించాలని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సూరజ్ గ్రాండ్ హోటల్‌లో జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి నిరోధకానికి టీడీపీ నేత చంద్రబాబునాయుడు స్టేలు, కేసులు వేసి ప్రజల్లో జగనన్న పాలనపై ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారన్నారు. రాయలసీమకు హైకోర్టు తేవడానికి జగనన్న ఎంతో ప్రయత్నం చేశారని, దాన్ని నిలుపుదల చేయడానికి టీడీపీ నాయకులు కేసులు వేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీటన్నింటిని తిప్పికొట్టే బాధ్యత వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ న్యాయవాదులదని, ఈ మేరకు ప్రజల్లో అవగాహన తీసుకు రావాలన్నారు. ఏపీ వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ భూ యాజమాన్యం చట్టం కింద జారీ చేసిన జీవో 512 విషయంలో టీడీపీ నాయకులు రైతులు, ప్రజలను మభ్యపెడుతున్నారని, ఈ ప్రయత్నం అడ్డుకునేందుకు న్యాయవాదులు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో నామినేషన్ నుంచి ఓటింగ్ వరకు వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ న్యాయవాదులు ప్రణాళికలు సిద్ధం చేసుకొని పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు చేదోడుగా లా నేస్తం పథకాన్ని దేశంలోనే అమలు పరిచిన వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేసిన ఘనత ఒక్క సీఎం జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. కార్యక్రమంలో నంద్యాల వైఎస్సార్‌సీపీ జోనల్ ఇన్‌చార్జ్ రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, లీగల్‌సెల్ నాయకులు సందానీ, సుగుణారెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, రమేష్‌బాబు, ముక్కెర కృష్ణారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు బార్ అసోసియేషన్‌ల లీగల్‌సెల్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి