ఆలయ భద్రత భారం మల్లన్నదే! | - | Sakshi
Sakshi News home page

ఆలయ భద్రత భారం మల్లన్నదే!

Mar 28 2023 1:04 AM | Updated on Mar 28 2023 1:04 AM

శ్రీశైల దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది   
 - Sakshi

శ్రీశైల దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది

శ్రీశైలంటెంపుల్‌: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠం కలసివెలసిన పుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి రోజూ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తారు. శ్రీశైల దేవస్థానం రక్షణ, భక్తుల భద్రత అత్యంత కీలకం కాగా.. మూడు నెలలుగా ఆలయ చీఫ్‌ సెక్యూరీటీ ఆఫీసర్‌ (సీఎస్‌ఓ) పోస్టు ఖాళీగా ఉండటం పలు విమర్శలకు దారితీస్తోంది. సుమారు 150 మంది సెక్యూరిటీ గార్డులు, 50 మంది హోంగార్డులు ఆలయం భద్రతకు విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రతా పరంగా ఆలయంలోకి సెల్‌పోన్లు, పేలుడు పదార్థాలు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహించడం, టికెట్‌ కౌంటర్ల వద్ద రద్దీ క్రమబద్ధీకరణ, దేవస్థాన భూములు, ఆస్తుల పరిరక్షణ, అసాంఘిక శక్తులు ఆలయంలోకి చొరబడకుండా అరికట్టడం, క్షేత్ర రక్షణ, పలు రకాల విధులను సీఎస్‌ఓ పర్యవేక్షిస్తారు. గతంలో పనిచేసిన సీఎస్‌వో రెండేళ్ల కాల పరిమితి కాగా గత సంవత్సరం డిసెంబర్‌ 27వ తేదీతో పూర్తయింది. అప్పటి నుంచి సుమారు మూడు నెలలుగా సీఎస్‌వో పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టు ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమించుకోవాలని దేవదాయశాఖ ఆదేశించింది. సీఎస్‌వోగా విధులు నిర్వహించే వ్యక్తి శారీరకంగా, ఆరోగ్యకరంగా ధృఢంగా ఉండాలి. ఇప్పటి వరకు దేవస్థాన సీఎస్‌వోలుగా రిటైర్డ్‌ సీఐలు, ఆర్మీ అధికారులు విధులు నిర్వహించారు. ప్రస్తుతం పర్యవేక్షకులు స్థాయి అధికారికి ఇన్‌చార్జ్‌ సీఎస్‌వోగా తాత్కాలిక విధులు కేటాయించారు.

అర్హతలు నోటిఫికేషన్‌కే పరిమితం..

శ్రీశైల దేవస్థానంలో సీఎస్‌వో పోస్టుకు డీఎస్పీ స్థాయి అధికారిని తీసుకోవాలని దేవదాయశాఖ ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ ఔట్‌సోర్సింగ్‌ పోస్టు కావడంతో ఇప్పటి వరకు డీఎస్పీ స్థాయి అధికారి ఎవరూ విధులు నిర్వహించ లేదు. గతంలో సీఎస్‌వోగా రిటైర్డ్‌ సీఐ స్థాయి వారు ముగ్గురు, రిటైర్డ్‌ ఆర్మీ అధికారి ఒకరు విధులు నిర్వహించారు. మిగిలిన వారు దేవస్థాన పర్యవేక్షకులు, ఏఈవో స్థాయి అధికారులు విధులు నిర్వహించారు. ఔట్‌ సోర్సింగ్‌ పోస్టు కావడం, నామమాత్రపు అధికారాలు ఉండటంతో భద్రత పరంగా ఏదేని చర్యలు తీసుకోవాలన్నా ఈఓ అనుమతి తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీఎస్‌ఓ పోస్టు భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 1న దేవస్థానం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కనీసం ఐదేళ్లు డీఎస్పీ హోదాలో విధులు నిర్వహించి, పదవీ విరమణ చేసి, 65 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించారు. అయితే ఈ పోస్టుకు కేవలం 8 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో మొదటి సారిగా ముగ్గురు రిటైర్డ్‌ డీఎస్పీలు, ఒకరు రిటైర్డ్‌ ఏఎస్పీ, ఒకరు జైలర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీశైల ఆలయ భద్రతా దృష్ట్యా సీఎస్‌ఓ పోస్టులో ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకుంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

ఎస్పీ పర్యవేక్షణలోనే నియామకం

శ్రీశైల దేవస్థానం భద్రత ఎంతో కీలకం. ఇందుకోసం రిటైర్డ్‌ డీఎస్పీ స్థాయి అధికారిని భద్రతాధికారిగా నియమించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశాం. ఇప్పటి వరకు ఎనిమిది దరఖాస్తులు వచ్చాయి. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో నియామకం చేపట్టాలని లేఖ రాశాం. ఎస్పీ పర్యవేక్షణలో సీఎస్‌వో నియామకం జరుగుతుంది. ఎస్పీ సూచనలు, సలహాల ప్రకారం క్షేత్రంలో సీఎస్‌వో పర్యవేక్షణలో భద్రత చర్యలు చేపడతాం.

– ఎస్‌.లవన్న, శ్రీశైలాలయ కార్యనిర్వహణాధికారి

మూడు నెలలుగా సీఎస్‌వో పోస్టు ఖాళీ

ఔట్‌ సోర్సింగ్‌ పోస్టు..

నామమాత్రపు అధికారాలు

ఆసక్తి చూపని రిటైర్ట్‌ పోలీసు

అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement