నిర్లక్ష్యంగా వాహనాలు నడపొద్దు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంగా వాహనాలు నడపొద్దు

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

నల్లగొండ : మద్యం తాగి నిర్లక్ష్యంగా అధిక వేగంగా వాహనాలు నడపొద్దని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ అన్నారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో లారీ అసోసియేషన్‌ ప్రతినిధులు, ట్రాన్స్‌పోర్ట్‌ యాజమాన్యం, డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి డ్రైవర్‌ డిఫెన్సివ్‌ డ్రైవింగ్‌ను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇతర వాహనదారుల పొరపాట్లను ముందుగానే అంచనా వేసి అప్రమత్తంగా వాహనం నడిపితేనే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ నిబంధనలు, నిర్దేశిత వేగ పరిమితి పాటించాలన్నారు. వాహనాలను ఎడమ వైపు నుంచి ఓవర్‌టేక్‌ చేయకూడదన్నారు. వాహనాలను రోడ్డు వెంట నిలిపినప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్‌ కోన్స్‌, రిఫ్లెక్టర్‌ స్టిక్కర్లు, ఇండికేటర్లు ఉపయోగించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారి టోల్‌ప్రీ నంబర్‌ 1033 కు కాల్‌ చేసి సహాయం పొందాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు, ప్రమాదాలు జరగకుండా భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి లేదన్నారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర్‌ పథకం కింద ప్రోత్సాహక నగదు అందజేస్తామన్నారు. రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లిన వ్యక్తికి మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు, మూడోసారి రూ.లక్ష ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ రమేష్‌, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, ట్రాఫిక్‌ సీఐ మహాలక్ష్మయ్య, రిటైర్డు సీఐ అంజయ్య, మిర్యాలగూడ లారీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ చాంద్‌పాషా, సెక్రటరీ రవీందర్‌రావు, పోలీసులు పాల్గొన్నారు.

ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement