అక్రమాలకు అడ్డుకట్ట
ప్రభుత్వం వారంలోగా ఎన్‌వోసీ ఇవ్వడానికి సంసిద్ధత తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డితో ఇటీవల జరిగిన సమావేశంలో ఎన్‌డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీ ప్రతినిధులకు ఎన్‌వోసీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈనెలలోనే ఎన్‌డీడీబీ టేకోవర్ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.
– గుడిపాటి మధుసూదన్‌రెడ్డి,
నార్ముల్ చైర్మన్
సాక్షి, యాదాద్రి : నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ (నార్ముల్) కష్టాలు తీరే సమయం వచ్చేసింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన నార్ముల్‌ను కాపాడేందుకు ప్రభుత్వం.. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ)తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి.. ఎన్‌డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, ఢిల్లీ మదర్ డెయిరీ చైర్మన్ జయతీర్థాచారితో ఇటీవల హైదరాబాద్ సమావేశం అయ్యారు. 15ఏళ్ల పాటు డెయిరీని అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం వేలాది మంది డెయిరీ రైతులకు శుభవార్తే అని చెప్పవచ్చు.
ఏటా రూ.5కోట్ల గుడ్‌విల్
రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీ నార్ముల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నార్ముల్‌కు ఏటా ఎన్‌డీడీబీ రూ.5 కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు రూ.25 కోట్ల గుడ్ విల్ ఇస్తుంది. ఈ డబ్బులతో రైతులకు బోనస్, ఇతర సదుపాయాలు కల్పిస్తారు. అయితే నార్ముల్ పాల సేకరణకు 2లక్షల లీటర్లకు పెంచాలి. పాలు, పాల ఉత్పత్తులను మాత్రం ఎన్‌డీడీబీ ఆధ్వర్యంలో ఢిల్లీ మదర్ డెయిరీ నిర్వహించనుంది. లీటర్ పాలకు రూ.6.50 కమీషన్ చెల్లిస్తారు. తద్వారా నార్ముల్‌కు నెలకు రూ.2.కోట్ల ఆదాయం లభించనుంది.
ఆరుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీ
నష్టాల్లో కూరుకుపోయిన నార్ముల్‌ను గాడిన పెట్టడానికి ఆరుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఎన్‌డీడీబీ నుంచి ఇద్దరు, ఢిల్లీ మదర్ డెయిరీ నుంచి ఇద్దరు, నార్ముల్ నుంచి చైర్మన్, ఎండీ ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురితో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే మొత్తం డెయిరీ వ్యవహారాలు జరగనున్నాయి.
ఎన్‌డీడీబీ నుంచి రూ.50కోట్లు
ఒప్పందం ప్రకారం నార్ముల్‌ను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఎన్‌డీడీబీ దశల వారీగా రూ.50 కోట్లు ఇవ్వనుంది. 50 వేల మంది రైతులు, 311 రిజిస్టర్ సొసైటీలు, రోజు 50 వేల లీటర్ల పాల అమ్మకాలు ఉన్నాయి. ప్రధానంగా రైతులకు ఇవ్వాల్సిన 9 పాల సేకరణ బిల్లుల మొత్తం రూ.25 కోట్లు, బ్యాంకు అప్పులు రూ.26 కోట్లు, ఉద్యోగుల జీతాలు రూ.4 కోట్లు, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.6 కోట్ల వరకు ఉన్నాయి. వీటన్నింటిని ఎన్‌డీడీబీ ఇచ్చే రూ.50 కోట్లతో సర్దుబాటు చేస్తారు.
30 శాతం వేతనాలు కట్
డెయిరీలో ప్రస్తుతం అవసరానికి మించిన ఉద్యోగులు ఉన్నారని గుర్తించారు. వీరిని తగ్గించుకోవాలన్నది తాజా నిర్ణయం. 300 మంది ఉద్యోగులు అవసరం ఉండగా, 500కు పైగా ఉద్యోగులు ఎందుకన్నది చర్చిస్తున్నారు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఉద్యోగుల వేతనాల్లో 30 శాతం కట్ చేయాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. తక్కువ వేతనంతో పనిచేసే వారు ఉంటారు. లేదంటే వారే స్వచ్ఛందంగా తప్పుకుంటారన్న చర్చ జరుగుతోంది.
ఎన్‌వోసీ ఇవ్వగానే టేకోవర్
ప్రస్తుతం నార్ముల్‌ను టేకోవర్ చేయడానికి ఎన్‌డీబీబీ సిద్ధమైంది. హయత్‌నగర్‌లోని నార్ముల్ డెయిరీ ప్లాంటు భూములు 73 ఎకరాలు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న చిల్లింగ్ సెంటర్ల భూములు, చిట్యాల భూములపై ఎన్‌డీడీబీకి ప్రభుత్వం ఎన్‌వోసీ ఇవ్వాలి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ మేరకు అంగీకారం తెలిపారు. ఎన్‌వోసీ ఇస్తే డెయిరీ ప్లాంటును విస్తరించడం, భువనగిరిలో ఫీడ్ మిక్సింగ్ ప్లాంటును పునురుద్ధరించడం, చిల్లింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తారు.
డెయిరీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నది మరో ప్రధాన నిర్ణయం. ఇటీవల భువనగిరి, సూర్యాపేట మిల్క్‌చిల్లింగ్ సెంటర్లలో రూ.45 లక్షల అక్రమాలు వెలుగుచూశాయి. మూతబడిన సొసైటీల పేరున డెయిరీకి పాలు పోసినట్లు రికార్డులు సృష్టించిన వ్యవహారంలో భువనగిరిలో రూ.40 లక్షలు, సూర్యాపేటలో రూ.5 లక్షల అక్రమాలు వెలుగు చూశాయి. బాధ్యులైన ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ ఒప్పందంతో నార్ముల్‌లో అక్రమాలకు అడ్డకట్ట పడనుంది.


