నల్లగొండ : ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ చంద్రశేఖర్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 126 ఫిర్యాదులు రాగా.. వాటిలో రెవెన్యూ శాఖకు 69, ఇతర శాఖలకు 57 వచ్చాయని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
2న గ్రామ, వార్డు సభలు
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సభలో ప్రజలకు తెలియజేయాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలకు డీఆర్‌డీఏ, మెప్మా తదితర శాఖలు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైల్స్ వెంటనే క్లీయర్ చేయాలన్నారు. అనంతరం జాతీయ సీనియర్ చెవిటి క్రీడల చాంపియన్ షిప్ పోటీల్లో విజేతలను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి పాల్గొన్నారు.
1 నుంచి ఈ – ఆఫీస్ ఫైల్
ఫైళ్ల నిర్వహణలో పారదర్శకత, వేగవంతానికై ఏప్రిల్ 1 నుంచి ఈ– ఆఫీసు ఫైల్ పద్ధతిని అమలు చేయనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ– ఆఫీస్ ఫైల్ నిర్వహణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ –ఆఫీస్ ఫైలింగ్ విధానంతో ఫైళ్ల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానం వల్ల ఫైళ్లను భౌతికంగా అధికారి వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌లోనే అనుమతి తీసుకోవచ్చన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, దేవరకొండ ఆర్‌డీఓ రమణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ మోతి లాల్, దుర్గారావు పాల్గొన్నారు.


