పెద్దవూర: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం గేమ్యానాయక్ తండాకు చెందిన వడ్త్య తార(48) భర్తతో విడాకులు తీసుకుని అదే తండాలో తన తల్లి వద్ద ఉంటుంది. కొద్దిరోజులుగా ఉట్లపల్లి గ్రామానికి చెందిన బొజ్జ బుజ్జమ్మ ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం ఉట్లపల్లిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు వెళ్లిన తార మద్యం సేవించి గజ్జల లింగారెడ్డి ఇంటి సమీపంలో రోడ్డుపై నిద్రించింది. ఈ క్రమంలో రాత్రి గుర్తుతెలియని వాహనం రోడ్డుపై నిద్రించిన తారను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు మంగులాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వై. ప్రసాద్ తెలిపారు.
హైవేపై రసాయన వ్యర్థాల పారబోత
చిట్యాల : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి పారబోశారు. దీంతో హైవే వెంట దుర్వాసన వస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాత్రివేళ గుట్టుచప్పుడు కాకుండా రసాయన వ్యర్థాలు పారబోస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
వేడి బూడిదలో దిగిన
ముగ్గురు చిన్నారులకు గాయాలు
హుజూర్‌నగర్ : రోడ్డు పక్కన పోసిన వేడి బూడిదలోకి దిగిన ముగ్గురు చిన్నారుల కాళ్లకు గాయలయ్యాయి. ఈ ఘటన సోమవారం హుజూర్‌నగర్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు పక్కన ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు కాలిన వరిపొట్టు బూడిదను పోశారు. పాఠశాలకు సెలవు కావడంతో సమీపంలో ఉండే ముగ్గురు పిల్ల లు విశాల్, నాగ యశ్వంత్, యశ్వంత్ ఆడుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్లారు. విశాల్ బూడిదలోకి దిగడంతో అతడి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. అతడిని రక్షించేందుకు వెళ్లిన నాగయశ్వంత్, యశ్వంత్‌కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. విశాల్‌ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి, అక్కడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.


