104 సిబ్బంది వేతన వెతలు
వెంటనే వేతనాలు చెల్లించాలి
వేతనాలు సక్రమంగా చెల్లించని కారణంగా అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోంది. తొమ్మిది నెలలుగా వేతనాలను ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకుని వెంటనే వేతనాలను చెల్లించాలి.
– గజవెల్లి శివకిరణ్, డేటాఎంట్రీ ఆపరేటర్
నల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 104 సిబ్బందికి తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదు. అసలు వీరు ఏ శాఖ కింద పని చేస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏ విభాగం నుంచి వేతనాలు ఇస్తారో కూడా స్పష్టత లేదు. వేతనాలు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కాలం వెల్లదీస్తున్నారు. ఇచ్చేదే తక్కువ వేతనాలు.. అవి కూడా నెలనెలా ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
2022 నుంచి ఇతర శాఖల్లో సర్దుబాటు
జిల్లా వ్యాప్తంగా 2008 సంవత్సరం నుంచి 104 వాహనాల్లో 2022 సంవత్సరం వరకు 75 మంది ఉద్యోగులు ఔట్‌సోర్సింగ్ పద్ధతిని పనిచేశారు. వారిలో డేటాఎంట్రీ ఆపరేటర్లు 12 మంది, డ్రైవర్లు 14 మంది, ఫార్మసిస్టులు 22 మంది, ల్యాబ్ టెక్నీషియన్లు 21 మంది, సెక్యూరిటీ గార్డులు ఆరుగురు పనిచేశారు. వారంతా అప్పుడు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పనిచేశారు. పథకాన్ని నిలిపివేసిన తరువాత వారిని వివిధ మెడికల్ కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఆ సమయంలో నల్లగొండ మెడికల్ కళాశాలలో వివిధ రకాల పోస్టులు ఖాళీ ఉన్నప్పటికీ వారిని ఇక్కడ నియమించకుండా.. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట మెడికల్ కళాశాలలకు, మరికొందరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సర్దుబాటు చేశారు. ఈ ఏడాది మార్చి వరకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనరేట్ నుంచి వేతనాలు అందాయి. కానీ, ఏప్రిల్ నుంచి వారికి వేతనాలను చెల్లించడం లేదు. మెడికల్ కళాశాలల నుంచి వేతనాలు ఇస్తారా.. లేక వైద్య ఆరోగ్యశాఖ కమిషనరేట్ చెల్లిస్తుందా అనే విషయం స్పష్టం చేయడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలనెలా వేతనాలు రాక ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫ తొమ్మిది నెలలుగా అందని వేతనాలు
ఫ కుటుంబాలు గడవక ఇబ్బందులు


