యాదగిరి క్షేత్రంలో ఏకాదశి పూజలు
యాదగిరిగుట్ట : ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో వజ్రవైడూర్యాలతో అలంకృతులైన ఉత్సవమూర్తులకు ఆగమశాస్త్రం ప్రకారంగా వూదమంత్ర పఠనాలతో అర్చకులు లక్ష పుష్పార్చన చేశారు.ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, స్వామి, అమ్మవారికి నిత్య తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం, వెండి జోడు సేవోత్సవం తదితర ఆరాధనలు చేపట్టారు. అనుబంధ శివాలయంలో బిల్వార్చన, రుద్రాభిషేకం, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


