యాసంగి పంటకు మూసీనీటి విడుదల
కేతేపల్లి : యాసంగి సాగు కోసం మూసీ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ఆయకట్టుకు సోమవారం అధికారులు నీటిని విడుదల చేశారు. 645 అడుగుల(4.46టీఎంసీలు) గరిష్ఠ నీటిమట్టం గత మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 644.70 అడుగుల(4.38 టీఎంసీలు) నీరు ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని 35 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఏటా యాసంగి పంటకు మూసీ ప్రాజెక్టు నుంచి డిసెంబర్ 18న కాల్వలకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు ఈ ఏడాది మూడు రోజుల ముందుగానే నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నాలుగు విడతలుగా సాగు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడత 25 రోజుల పాటు నిరంతరాయంగా కాల్వలకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. నీటిని రైతాంగం పొదుపుగా వాడుకుని చివరి ఆయకట్టుకు చేరే విధంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మూసీ ఏఈలు ఉదయ్, మమత, కీర్తి, ఉమామహేష్, సిబ్బంది పాల్గొన్నారు.


