లోక్ అదాలత్‌లో 2,921 కేసులు పరిష్కారం
రామగిరి(నల్లగొండ): లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చని జిల్లా ఇన్‌చార్జి జడ్జి జి.సంపూర్ణ ఆనంద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 12 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా 31 సివిల్, 2,813 క్రిమినల్, 45 మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 6 చెక్ బౌన్స్ కేసులు, 26 సైబర్ క్రైమ్స్‌తో కలిపి మొత్తం 2,921 (పెండింగ్, ప్రీ లిటిగేషన్) కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. ఇందులో ప్రమాద బీమా కేసులలో కక్షిదారులకు రూ.2,95,35,000 నష్టపరిహారం అందజేసినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్ కేసులో రికవరీ రూ.2,17,915 ఇప్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కార్యదర్శి పి.పురుషోత్తంరావు, మహిళా కోర్టు జడ్జి కవిత, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి, మంద నగేష్, న్యాయవాదులు, లా కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ఇన్‌చార్జి జడ్జి సంపూర్ణ ఆనంద్


