బండరాళ్లను దాటుకుంటూ బడికి..
నిడమనూరు : మండల కేంద్రం నుంచి బంకాపురం, వెనిగండ్ల, సూరేపల్లి గ్రామాలకు వెళ్లే రహదారిలో నిడమనూరు ఆదర్శ పాఠశాల సమీపంలోని లో లెవల్ కల్వర్టు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతింది. కల్వర్టు సీసీ లైనింగ్ పూర్తిగా దెబ్బతిని రాళ్లమయంగా మారింది. ఆ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే.. మండల కేంద్రం నుంచి ఆదర్శ పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ప్రజలు ఆ బండ రాళ్లపైనుంచే వెళ్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా, ధాన్యాన్ని తరలించాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. లోలెవల్ కల్వర్టు స్థానంలో రూ.3 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. లోలెవల్ కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు రైతులు కోరుతున్నారు.


