‘పెండ్లిపాకల’ పనులు పునరుద్ధరిస్తాం
కొండమల్లేపల్లి: ఇటీవల కురిసిన మోంథా తుపాను వల్ల దెబ్బతిన్న పెండ్లిపాకల రిజర్వాయర్ పనులన్నీ పునరుద్ధరిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని దెబ్బతిన్న పెండ్లిపాకల రిజర్వాయర్‌ను శనివారం ఆమె.. ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమె ఒకటవ వీయర్ నుండి 5వ వీయర్ వరకు కాలినడకన పర్యటిస్తూ రిజర్వాయర్ కింద ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన కాలువలు, దెబ్బతిన్న, రహదారులు, బాటలను, కుంట కట్టల పరిస్థితిని పరిశీలించారు. అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే గ్రావిటీ ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందనుందని కలెక్టర్‌కు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండ్లిపాకల పనుల పునరుద్ధరణకు ఎఫ్‌డీఆర్‌లను పంపించినట్లు తెలిపారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఆర్‌డీఓ రమణారెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ భద్రు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ నాయక్, డీఈ రాములు, ఏఈఈ భాస్కర్ రావు, శ్రవణ్, సతీష్, కొండమల్లేపల్లి తహసీల్దార్ నరేందర్, ఎస్‌ఐ అజ్మీరా రమేష్ ఉన్నారు.
నక్కలగండి పరిశీలన
చందంపేట : చందంపేట మండలంలోని తెల్దేవర్‌పల్లి పరిధిలోని నక్కలగండి రిజర్వాయర్ పనులను శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ఇటీవల మోంథా తుపాను ప్రభావంతో రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు రావడంతో ముంపు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో కలెక్టర్ పర్యటించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట పలువురు అధికారులు ఉన్నారు.
నెలాఖరు వరకు ‘డబుల్’ ఇళ్ల పంపిణీ
నల్లగొండ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై నల్లగొండ కలెక్టరేట్ నుంచి శనివారం ఆమె హౌసింగ్ పీడీ, ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తయ్యాయన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం మొత్తం వీడియో తీయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
‘పెండ్లిపాకల’ పనులు పునరుద్ధరిస్తాం


