చికిత్స పొందుతూ యువకుడి మృతి
భూదాన్‌పోచంపల్లి: పాము కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సోమవారం తెల్ల వారుజామున మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన చెక్క రమేశ్(34) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి కొంత భూమి ఉండడంతో వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఈ నెల 13న పొలం వద్దకు వెళ్లిన రమేశ్ గట్టుపై నడుచుకుంటూ వస్తుండగా పాముకాటుకు గురై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. అరగంట తర్వాత స్పృహాలోకి వచ్చిన రమేశ్ తెలిసిన వ్యక్తి బైక్‌పై ఇంటికి చేరుకుని.. తనకు పాము కరిచిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వెంటనే అతడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నాలుగు రోజులు వైద్యం చేసినప్పటికీ అతడు కోలుకోకపోవడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి సకాలంలో వైద్యం అందకపోవడంతో పాము విషం శరీరం మొత్తం పాకి రెండు కిడ్నీలు చెడిపోయాయని పేర్కొన్నారు. వారం రోజులుగా వైద్యులు రమేశ్‌కు డయాలసిస్ చేస్తుండగా సోమవారం తెల్ల వారుజామున గుండెపోటు వచ్చి మృతిచెందాడు. మృతుడికి భార్య సబిత, కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం అతడి భార్య 7 నెలల గర్భవతి అని తెలిసింది. మృతుడి అన్న మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.
గుర్తుతెలియని మహిళ..
భువనగిరిటౌన్ : భువనగిరి బస్టాండ్‌లో అనారోగ్యంతో పడి ఉన్న గుర్తుతెలియని మహిళను 108 సిబ్బంది భువనగిరి ఏరియా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పట్టణ ఎస్‌ఐ నరేష్ తెలిపారు. మృతురాలి పేరు లక్ష్మి(60) అని, పసుపు, ఎరుపు రంగులతో కూడిన చీర, జాకెట్ ధరించిందని, ఆమె వివరాలు తెలిసిన వారు పట్టణ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


