అనూషారెడ్డి మృతదేహం బంధువులకు అప్పగింత
గుండాల: ఏపీలోని కర్నూలు జిల్లాలో గురువారం రాత్రి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించినట్లు బంధువులు తెలిపారు. అక్కడి జిల్లా ఉన్నతాధికారుల సమాచారం మేరకు మృతురాలి ఆధార్ కార్డు, తండ్రి ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు అకౌంట్ జిరాక్స్‌లను తీసుకొని ఆస్పత్రికి చేరుకున్న బంధువులకు మృతదేహం అప్పగించినట్లు చెప్పారు. ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని వస్తాకొండూర్ తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 108 వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం 2 గంటల సమయంలో మృతదేహం గ్రామానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అనూషారెడ్డి కుటుంబానికి పరామర్శ
అనూషారెడ్డి కుటుంబాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఆదివారం పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
సంస్థాన్ నారాయణపురం: తల్లి కళ్ల ముందే కుమారుడు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్జ గ్రామానికి చెందిన చెన్నోజు రామాచారి(26) హైదరాబాద్‌లో అద్దెకు ఉంటూ చిన్న చిన్న కంప్యూటర్ పనులు చేస్తూ.. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. గుజ్జ గ్రామంలో నెల రోజుల క్రితం తన ఇంటికి మర్మమతులు చేపట్టారు. శనివారం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చిన రామాచారి కొత్తగా కొనుగోలు చేసిన మోటారును ఆదివారం ఫిట్టింగ్ చేసి గోడలకు నీళ్లు కొట్టాడు. ఈ క్రమంలో రామాచారి పూర్తిగా తడిసిపోయాడు. గోడలకు నీళ్లు కొట్టడం పూర్తికావడంతో తల్లి చంద్రకళను మోటారు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాడు. ఈ క్రమంలో మోటారు దగ్గర ఉన్న వైరు ప్లగ్ తీస్తుండగా.. రామాచారి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కుమారుడికి ఏమైందో చూసేందుకు వెళ్లిన చంద్రకళకు కూడా ఎర్తింగ్ రావడంతో ఆమె వెనుకకు వచ్చింది. కర్ర తీసుకొని రామాచారి చేతిలోని వైరును తొలగించి చుట్టుపక్కల వారి సహాయంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్ల వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగన్ తెలిపారు. మృతుడికి తల్లి, ఇద్దరు సోదరిణులున్నారు.
అనూషారెడ్డి మృతదేహం బంధువులకు అప్పగింత


