త్రిఫ్ట్ డబ్బులేవీ..!
భూదాన్‌పోచంపల్లి: చేనేత కార్మికులకు నాలుగు నెలలుగా త్రిఫ్ట్ (పొదుపు పథకం) డబ్బులు రావడంలేదు. ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి త్రిఫ్ట్ (పొదుపు పథకాన్ని) అమలు చేస్తోంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా చేనేత కార్మికులు ఉన్న మండలాలు, గ్రామాలలో అధికారులు సమావేశాలు నిర్వహించి త్రిఫ్ట్ పథకంపై అవగాహన కల్పిస్తూ కార్మికుల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 10,790 మంది మగ్గం నేసే కార్మికులు, అనుబంధ కార్మికులు త్రిఫ్ట్ పథకంలో చేరారు.
అమలు ఇలా..
చేనేత వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న చేనేత కార్మికులు తమ వేతనం నుంచి 8 శాతం వాటాను రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ) అకౌంట్–1లో జమ చేస్తే ప్రభుత్వం ఆ మొత్తానికి రెండింతలు అనగా 16 శాతం మ్యాచింగ్ గ్రాంటును ఆర్‌డీ అకౌంట్–2లో కార్మికుడి ఖాతాలో జమ చేస్తుంది. కార్మికుడు పనిచేసిన నెల వేతనం నుంచి గరిష్టంగా రూ.12వేలు, అనుబంధ కార్మికుడైతే రూ.800 బ్యాంకులో జమచేసుకోవచ్చు. రెండేళ్ల మెచ్యూరిటీ అనంతరం జమ అయిన మొత్తాన్ని కార్మికుడు డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా మర మగ్గాలకు కూడా కార్మికులు గరిష్టంగా నెలకు రూ.1000, అనుబంధ కార్మికుడు రూ.600 జమచేస్తే ప్రభుత్వం అంతే మొత్తంలో ఆర్‌డీ–2 అకౌంట్‌లో జమ చేస్తుంది.
ఒక్క నెల మాత్రమే జమ..
త్రిఫ్ట్ పథకంలో నమోదు చేసుకున్న కార్మికులు ఆయా బ్యాంకుల్లో ఆర్‌డీ–1 అకౌంట్లు తెరిచి నెలనెలా వస్తున్న ఆదాయం నుంచి తమ వాటా కింద రూ.1.85 కోట్లు జమ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా తమ వాటా కింద రెండింతలు అనగా రూ.2.17 కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కేవలం మే నెల మాత్రమే తమ వాటా జమ చేసింది. జూన్ నెల నుంచి ఇప్పటి వరకు నాలుగు నెలలుగా అకౌంట్‌లో డబ్బులు జమ చేయడంలేదు.
ఫ నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి జమకాని డబ్బులు
ఫ నెలనెలా డబ్బులు జమ చేయాలని కోరుతున్న చేనేత కార్మికులు


