రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
మిర్యాలగూడ : ధాన్యం సేకరణలో భాగంగా ఈ వానాకాలానికి సంబంధించి రైస్ మిల్లర్లు తక్షణమే బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ధాన్యం సేకరణలో భాగంగా ఈ వానాకాలం ధాన్యాన్ని మిల్లర్లు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉన్నందున నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో జాప్యం చేయొద్దన్నారు. అనంతరం ఆమె అవంతీపురం సమీపంలోని సూర్యతేజ రైస్ మిల్లును సందర్శించి అక్కడ ధాన్యం ప్రాసెసింగ్ ప్రక్రియను పరిశీలించారు. బాయిల్డ్ రైస్, డ్రైయర్స్ తదితర అంశాలను మిల్లు యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్, జిల్లా మేనేజర్ గోపికృష్ణ, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ వెంటరమణచౌదరి, మిల్లర్లు గంటా సంతోష్‌రెడ్డి, జైని ప్రకాశ్‌రావు, జైని మురళి, గుడిపాటి శ్రీనివాస్, పైడిమర్రి సురేష్, పైడిమర్రి రంగనాథ్ తదితరులు ఉన్నారు.
రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలి


