పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్ధం
తేమశాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూడాలి
నల్లగొండ అగ్రికల్చర్: నేటి నుంచి జిల్లాలో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఇందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. గతేడాది మందుగానే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల రైతులు ఆయా కేంద్రాల్లో పత్తిని అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధర పొందారు. జిల్లా వ్యాప్తంగా 5,56,826 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ఇప్పటికే రెండు విడతల్లో పత్తిని ఏరారు. కానీ సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించని కారణంగా కూలీలకు డబ్బులను చెల్లించడం కోసం రైతులు తమ పత్తిని దళారులకు, జిన్నింగ్ మిల్లులకు అమ్ముకుంటున్నారు. అయితే ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,100 కాగా వ్యాపారులు రైతుల అవసరాన్ని అసరాగా తీసుకుని క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు మాత్రమే కొనుగోలు చేస్తూ రైతులను నట్టేటా ముంచుతున్నారు. ఈ క్రమంలో తమకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు లక్ష క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
తొలుత 9 కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. అందులో రెండు జిన్నింగ్ మిల్లు మినహా మిగిలిన 23 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తిని కొనేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. దీంట్లో భాగంగా శుక్రవారం తొలుత తొమ్మిది సీసీఐ కొనుగోలు కేంద్రాను ఏర్పాటు చేయడానికి మార్కెటింగ్ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో సలపార్ కాటన్ మిల్ చండూరు, వరలక్ష్మి కాటన్ మిల్ చిట్యాల, శ్రీలక్ష్మీనర్సింహ ఆగ్రో ఇండస్ట్రీ మాల్ ఏ, శివగణేష్ కాటన్ మిల్ మాల్ బీ, శివగణేష్ కాటన్‌మిల్‌మల్లెపల్లి ఏ, తిరుమల కాటన్‌మిల్ మల్లేపల్లి బీ, శ్రీనాఽథ్ కాటన్ మిల్ నకిరేకల్, సత్యనారాయణ కాటన్ మిల్ నల్లగొండ, టీఆర్‌ఆర్ కాటన్ మిల్ శాలిగౌరారం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి.
తగ్గనున్న దిగుబడి
వరుస వర్షాల కారణంగా జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో పత్తి దిగుబడి సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పత్తి కాయదశ నుంచే వరుస వర్షాలు కురిసిన కారణంగా చేలు ఎర్రబారి కాయ, పత్తి రాలిపోయింది. దీంతో ఎకరాకు 8 క్వింటాళ్లకు బదులు 4 క్వాంటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమే ఉందని అంటున్నారు.
సీసీ కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే పత్తిలో తేమ శాతం 8 నుంచి12 వరకు ఉండేలా ఆరబెట్టాలి. తేమ శాతం తక్కువ ఉంటేనే ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.8,100 చెల్లిస్తారు. స్లాట్ బుక్ చేసుకున్నాక పత్తిని సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లాలి.
– ఛాయాదేవి, జిల్లా మార్కెటింగ్ ఏడీ
నేడు తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఫ మొత్తం 23 కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు
ఫ ఇప్పటి వరకు సీసీఐ కేంద్రాలు లేక వ్యాపారులకు అమ్ముతున్న రైతులు
ఫ మద్దతు ధర దక్కడం లేదని
తీవ్ర ఆవేదన


