పత్తి రైతుల ఫోన్ నంబర్లు అప్‌డేట్ చేయాలి
నార్కట్‌పల్లి: పత్తి అమ్మకాలకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉన్నందున పత్తి రైతుల ఫోన్ నంబర్లు అప్‌డేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ బి.గోపి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి వద్ద వరమహాలక్ష్మి జిన్నింగ్ మిల్లును జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో పత్తి దిగుబడి అంచనా, జిన్నింగ్ మిల్లుల ఏర్పాటు వివరాలను వ్యవసాయ శాఖ జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 2.77 లక్షల మంది పత్తి రైతులున్నట్లు వారు డైరెక్టర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గోపి మాట్లాడుతూ రోజు వారీగా ఎంతమంది రైతులు పత్తిని మిల్లులకు తీసుకొస్తున్నారో.. రాబోయే వారం రోజుల్లో మిల్లులకు వచ్చే పత్తి రైతుల వివరాలన్నిటినీ డాష్ బోర్డులో నమోదు చేయాలన్నారు. ఫోన్లు అప్‌డేట్ చేసిన రైతుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలన్నీ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యేలా సీసీఐ కొత్త సాఫ్ట్ వేర్ రూపొందించిందన్నారు. అన్ని జిన్నింగ్ మిల్లుల వద్ద వ్యవసాయ శాఖ తరఫున ఒక్కో అధికారిని నియమించాలన్నారు. అనంతరం వరమహాలక్ష్మి కాటన్ మిల్లుకు పత్తి తీసుకొచ్చిన రైతులతో మాట్లాడారు. రైతులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నివాస్, ఇన్‌చార్జి అదనపుకలెక్టర్ నారాయణ్ అమిత్, నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర వ్యవసాయ,
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి


