మిర్యాలగూడ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం గ్రామంలో గల సర్వే నంబర్ 214లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. గుర్తించిన మొత్తం 25 ఎకరాల స్థలంలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు సరిహద్దులు నిర్ధారించి మ్యాప్‌తో సహా పంపించాలని సూచించారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్, తహసీల్దార్ సురేష్ పాల్గొన్నారు.
వైద్యసిబ్బంది
అప్రమత్తంగా ఉండాలి
నార్కట్‌పల్లి: సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్యసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. నార్కట్‌పల్లి, అక్కెనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. నార్కట్‌పల్లి పీహెచ్‌సీలో రికార్డులను ప్రగతి నివేదికను పరిశీలించారు. అక్కెనపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి వరూధినిని అడిగి టీబీ, లెప్రసీ, ఎన్‌సీడీ, మాతాశిశు సంరక్షణ కార్యక్రమాల నివేదికలు తెప్పించుకుని పరిశీలించి మాట్లాడారు మాతాశిశు సంరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. ఆయన వెంట జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ విజయ్ కుమార్, నర్సింగ్ అధికారి లక్ష్మీ ఉన్నారు.
ప్రభుత్వం పంపిన
ప్రశ్నపత్రాలే వాడాలి
నల్లగొండ టూటౌన్ : జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ప్రభుత్వం పంపిన ప్రశ్నపత్రాలతోనే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని డీఈఓ భిక్షపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 31 వరకు ఎస్‌ఏ–1 పరీక్షలను నిర్దేశించిన కాలనిర్ణయ పట్టిక ప్రకారం నిర్వహించాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నవంబర్‌లో జిల్లా స్థాయి
వైజ్ఞానిక ప్రదర్శన
భారత శాస్త్ర సాంకేతిక మండలి న్యూఢిల్లీ, రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నవంబర్ నాలుగో వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీఈఓ భిక్షపతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో సైన్స్, గణితం, పర్యావరణ అంశాలపై 114 ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించబడుతాయని తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి తప్పనిసరిగా ఉప అంశాల వారీగా ప్రాజెక్టులను విద్యార్థులచే తయారు చేయించాలని డీఈఓ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ : 9848578845 నంబర్‌లో సంప్రదించానలని కోరారు.
నారసింహుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాతం సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని అభిషేకం, సమస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు.
‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపండి
‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపండి


