
సహకారం.. విస్తరణ
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) తన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 41 బ్రాంచ్‌ల ద్వారా ప్రజలు, రైతులకు వివిధ రకాల రుణాలను అందిస్తూ అండగా నిలుస్తోంది. ప్రస్తుతం మరో 6 కొత్త బ్రాంచ్‌ల ఏర్పాటుకు ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా) అనుమతిని ఇస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 47 బ్రాంచ్‌ల ద్వారా తన సేవలను మరింత విస్తరించనుంది. కొత్తగా సూర్యాపేట జిల్లా మోతె, చిలుకూరులో, నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం, నాంపల్లి, పెద్దవూర, మిర్యాలగూడ పట్టణంలో ఒక బ్రాంచ్ ఉండగా అదనంగా బ్రాంచ్–2 ఏర్పాటు కానుంది.
ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ బ్రాంచ్‌లు
రైతుల సంక్షేమం కోసం 107 సంవత్సరాల క్రితం ఏర్పడిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అంచెలంచెలుగా విస్తరిస్తూ రైతులకు సేవలు అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. నల్లగొండ డీసీసీబీనే ఎక్కుగా బ్రాంచ్‌లను కలిగి ఉంది. డీసీసీబీ ప్రస్తుతం రూ.3,400 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. మార్చి 2026 వరకు రూ.5 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్న లక్ష్యంగా పాలకవర్గం, అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా పంట రుణాలు, విదేశీ విద్యారుణాలు, బంగారు ఆభరణాల రుణాలు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక, గృహ, మార్టిగేజ్, వాహన, పౌల్ట్రీ, పాడి వంటి రుణాలను రైతులకు అందిస్తోంది.
యాసంగిలోనూ రూ.50 కోట్ల పంట రుణాలు
ప్రస్తుత వానాకాలంలో రైతులకు రూ.50 వేల కోట్ల పంటరుణాలను అందించిన డీసీసీబీ యాసంగి సీజన్‌లో కూడా రూ.50 కోట్ల పంటరుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తీసుకున్న రుణాలను రైతులు సకాలంలో తిరిగి చెల్లిస్తున్న నేపథ్యంలో రైతులు రుణాలను విరివిగా రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నందున రైతులు రుణాల కోసం బారులుదీరుతున్నారు. మహిళా సంఘాల బలోపేతం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో తక్కువ వడ్డీకి ఎలాంటి ప్రాసిసెంగ్ ఫీజు లేకుండా రుణాలను ఇవ్వాలని పాలకవర్గం నిర్ణయించింది. నాబార్డు రీఫైనాన్స్ ద్వారా రూ.200 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. బంగారు రుణాలను ఇప్పటి వరకు రూ.1,040 కోట్ల ఇచ్చి రాష్ట్రంలోని డీసీసీబీలో ప్రథమ స్థానంలో నిలిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి టర్నోవర్ రూ.5 వేల కోట్లకు చేరుకుని.. రూ.70 కోట్ల సాధించాలని పట్టుదలతో ఉంది.
ఫ డీసీసీబీకి మరో ఆరు కొత్త బ్రాంచ్‌లు
ఫ అనుమతి ఇచ్చిన ఆర్‌బీఐ
ఫ రైతులకు చేరువకానున్న సేవలు