
ధాన్యం వర్షార్పణం
చిట్యాల : మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసింది. అకస్మాత్తుగా వర్షం రావడంతో ఆరబెట్టిన ధాన్యపు రాశులతోపాటు కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండడంతోపాటు వర్షం పడడంతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యంలో తేమ శాతం పెరిగిపోయి కొనుగోళ్లు మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యంను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు మార్కెటింగ్ శాఖ అధికారులను కోరుతున్నారు.