
అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమించాలి
రామన్నపేట: అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత ఉద్యమించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఆదివారం రామన్నపేటలో నిర్వహించిన యువ కమ్యూనిస్టుల సమ్మేళనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేశంలో పెట్టుబడిదారీ విధానం వల్ల అసమానతలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ ప్రపంచంలో కమ్యూనిజం మహోన్నతమైన సిద్ధాంతమని, కమ్యూనిస్టులు పురోగామిశక్తులు అని చెప్పడానికి శ్రీలంక వంటి పరిణామాలే నిదర్శనమని వివరించారు. పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటి అమలు కోసం ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్య అందించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. యువత దోపిడి వ్యవస్థను నిలువరించాలని, మతోన్మాదశక్తులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో నాయకులు మేక అశోక్‌రెడ్డి, జెల్లెల పెంటయ్య, గడ్డం వెంకటేశం, బల్గూరి అంజయ్య, వనం ఉపేందర్, కూరెళ్ల నర్సింహాచారి, బోయిని ఆనంద్, కందుల హన్మంత్, కల్లూరి నాగేష్, గొరిగె సోములు, నాగటి ఉపేందర్, విజయ్‌భాస్కర్, మీర్‌ఖాజా, బాలరాజు, రామచంద్రం, శ్రవన్, శివ, ఉదయ్ పాల్గొన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
తమ్మినేని వీరభద్రం