యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను నిర్వహింంచేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణాతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధికంగా యాదగిరి క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించేందుకు ఆసక్తి కనబరుస్తారు. వ్రత పూజల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొండ దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని రెండు హాల్స్‌లో పూజ సామాగ్రి, వ్రత పీటలను, వ్రతంలో ఉపయోగించే ప్రసాదాలను ప్యాకింగ్ చేసి సిద్ధం చేశారు. యాదగిరి ఆలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్టలో సైతం భక్తులు వ్రతాలను జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు.
● యాదగిరి క్షేత్రంలో..
యాదగిరి క్షేత్రంలో నెల రోజుల పాటు 6 బ్యాచ్‌లుగా వ్రతాలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొదటి బ్యాచ్ ఉదయం 7గంటల నుంచి 8గంటల వరకు, రెండో బ్యాచ్ ఉదయం 9గంటల నుంచి 10 గంటల వరకు, మూడో బ్యాచ్ 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, నాల్గవ బ్యాచ్ మధ్యాహ్నం 1గంటల నుంచి 2గంటల వరకు, ఐదో బ్యాచ్ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, ఆరో బ్యాచ్ సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు నిర్వహించనున్నారు.
● పాతగుట్ట ఆలయంలో..
యాదగిరీశుడి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నాలుగు బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. మొదటి బ్యాచ్ ఉదయం 9గంటలకు, రెండో బ్యాచ్ 11గంటలకు, మూడో బ్యాచ్ మధ్యాహ్నం 2గంటలకు, నాల్గవ బ్యాచ్ సాయంత్రం 4గంటలకు నిర్వహిస్తారు.
● కార్తీక పౌర్ణమి రోజు..
వచ్చే నెల 5వ తేదీన కార్తీక శుద్ధ పూర్ణిమ నేపథ్యంలో యాదగిరి కొండకు దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఉదయం 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు 8 బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహించనున్నారు. ప్రతి గంటకు ఒక్క బ్యాచ్ చొప్పున 8 బ్యాచ్‌లు నిర్వహిస్తామని ఇప్పటికే ఆలయ ఈఓ రవినాయక్ వెల్లడించారు. కాగా పాతగుట్ట ఆలయంలో 6 బ్యాచ్‌లుగా వ్రతా లను భక్తులచే జరిపిస్తారు.
వ్రత మండపంలో సిద్ధం చేస్తున్న వ్రత పీటలు
యాదగిరి క్షేత్రంలో ఏర్పాట్లు
పూర్తిచేసిన అధికారులు
వ్రత మండపంలో పీటలు,
ప్రసాదాలు రెడీ