వైన్స్‌లకు 4,619 టెండర్లు
నల్లగొండ : వైన్స్ షాపులకు టెండర్ల ప్రక్రియ శనివారం రాత్రితో ముగిసింది. చివరి రోజు భారీగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో మొత్తం 154 వైన్స్‌లకు అధికారులకు టెండర్లు ఆహ్వానించగా సెప్టెంబర్ 26వ తేదీ నుంచి శనివారం(ఈ నెల18) వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల ఫీజుతో దరఖాస్తులను ఆహ్వానించగా శుక్రవారం వరకు 2,439 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు ఏకంగా 2,180 దరఖాస్తులు వచ్చాయి. శనివారం రాత్రి వరకు మొత్తం 4,619 దరఖాస్తులను ఎక్సైజ్‌శాఖ అధికారులు స్వీకరించారు. ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా వైన్స్‌లను కేటాయించనున్నారు.
గతం కంటే తగ్గిన దరఖాస్తులు
2023లో జిల్లాలో 155 వైన్ షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తే 7057 దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల డిపాజిట్ ఉండగా.. వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.141.14 కోట్ల ఆదాయం లభించింది. అయితే ఈసారి డిపాజిట్ ధరను రూ.3 లక్షలకు పెంచింది. మొత్తం 4,619 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.138.57 కోట్ల ఆదాయం సమకూరనుంది. అయితే 2023 టెండర్లతో పోల్చితే ఈ సారి దరఖాస్తుల సంఖ్యతోపాటు ఆదాయం కూడా తగ్గింది.
దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.138.57 కోట్ల రాబడి
2023తో పోల్చితే తగ్గిన
దరఖాస్తులు, ఆదాయం
చివరి రోజు 2,180 దరఖాస్తులు
ఈ నెల 23న లాటరీ ద్వారా ఎంపిక
అత్యధికంగా ధర్వేశిపురం వైన్స్‌కు..
కనగల్ మండలం ధర్వేశిపురం వైన్స్‌కు జిల్లాలోనే అత్యధికంగా 147 దరఖాస్తులు వచ్చాయి. 2023లో జరిగిన టెండర్లలో ఈ వైన్స్‌కు 187 దరఖాస్తులు వచ్చాయి. అప్పుడు కూడా జిల్లాలోనే అత్యధికంగా దరఖాస్తులు వచ్చింది ఈ వైన్స్‌కే. ఈసారి కూడా ఇక్కడి మద్యం దుకాణానికి 147 దరఖాస్తులతో మొదటిస్థానంలో నిలిచింది.


