
జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్)
ఇకపై జీఎస్టీ 5, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే..
12, 28 శాతం స్లాబ్‌ల తొలగింపు
వ్యవసాయ ఉపకరణాలన్నీ 5 శాతంలోకే..
నేటి నుంచి అమలులోకి కొత్త స్లాబ్‌లు
భువనగిరి: జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) స్లాబ్‌ల కుదింపుతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. షాంపూలు, సబ్బులు, ఏసీలు, టీవీలు, సిమెంట్ వంటి రోజువారీ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దీని వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గి, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ, మధ్య తరగతి వినియోగదారులు ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జీఎస్టీ విధింపులో నాలుగు స్లాబ్‌లు ఉండగా వాటిని రెండింటికి కుదించారు. పేదలు, రైతులు, మహిళలు, యువత వినియోగించే వస్తువులు, 12 రకాల సేవలు, 18 శాతం ఉన్న వాటిని 5 శాతం స్లాబ్‌లోకి మార్చారు. ఇందులో అనేక రకాల నిత్యావసర వస్తువులు సైతం ఉన్నాయి. దీంతో కుటుంబ ఖర్చు తగ్గనున్నాయి. కుటుంబ ఖర్చులే కాకుండా వ్యక్తిగత ఖర్చు సైతం సుమారు 10 శాతం ఆదా అయ్యే అవకాశం ఉంది. కొత్త స్లాబ్‌లు సోమవారం నుంచి అమలులోనికి రానున్నాయి.
రైతులు, మహిళలకు లబ్ధి
సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇప్పటికే రాయితీలను వర్తింపజేస్తోంది. కొంతకాలంగా వ్యవసాయ వస్తువులపై రాయితీలు తగ్గిపోవడమే కాకుండా పన్నుల వడ్డింపు పరిధిలోకి వెళ్లాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రైతుకు వచ్చే నికర లాభం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దీంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలుపై పన్ను భారం తగ్గనుంది. రైతులు వినియోగించే ట్రాక్టర్ల టైర్లు, విడిభాగాలు, కొన్నిరకాల పురుగుల మందులు, సూక్ష్మపోషకాలు, స్ప్రింకర్లు, డ్రిప్ పైపులు, వ్యవసాయ పరికరాల కొనుగోలు ఖర్చులు తగ్గనున్నాయి. 18 నుంచి 12 శాతం స్లాబ్‌లోని వాటిని ఐదు శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలు, మహిళలు, చిన్నారుల కోసం వినియోగించే పలు రకాల వస్తువులపై కూడా పన్ను భారం తగ్గనుంది. విద్యార్థులకు సంబంధించి మ్యాప్‌లు, చార్టులు, గ్లోబ్‌లు, పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, నోట్‌బుక్స్ వంటి వాటిపై 12 శాతం నుంచి సున్నా శాతానికి పన్ను భారం తగ్గనుంది. నిత్యావసర వస్తువులలో తల నూనెలు, షాంపులు, టూత్‌పెస్ట్, సబ్బులు, టూత్ బ్రెష్, షేవింగ్ క్రీం, వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, మిక్చర్, వంటసామగ్రి వంటి ఉన్నాయి. అంతేకాకుండా టీవీలు, చిన్న, మధ్య శ్రేణి కార్లు, బైకులు, వైద్య పరికరాలు, విద్యార్థులకు అవసరమైన వస్తువులపై కూడా పన్ను భారం తగ్గనుంది.
కుటుంబ ఖర్చులు ఆదా అవుతాయి
మహిళలు వినియోగించే కుట్టు మిషన్లు, వాటి విడిభాగాలతో పాటు చిన్న పిల్లలు ఉపయోగించే పలు రకాల వస్తువులపై పన్ను భారం తగ్గనుంది. పలు గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గటం వల్ల కుటుంబ ఖర్చులు సుమారు 10 శాతం వరకు ఆదా అవుతుంది. రైతులు, మహిళలు, చిన్నారుల సైతం ఈ విధానం వల్ల ప్రయోజనం కలగనుంది.
– శ్రావణి, గృహిణి, భువనగిరి
రైతులకు ప్రయోజనం చేకూరుతుంది
జీఎస్టీ తగ్గింపుతో లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై పన్ను భారం తగ్గనుంది. రైతులు వినియోగించే ట్రాక్టర్ల టైర్లు, విడిభాగాలు, కొన్ని రకాల పురుగు మందులు, సూక్ష్మపోషకాలు, స్ప్రింకర్లు, డ్పిప్ పైపులు కొనుగోలు చేయడంలో ఖర్చు ఆదా అవుతాయి.
– కస్తూరి సత్యనారాయణ, రైతు, వలిగొండ