
బృందావనపురంలో రైతులు సాగు చేస్తున్న బంతి తోట
పంట మార్పిడి చేస్తూ లాభాలు గడిస్తున్న రైతులు
ఈ సీజన్‌లో బంతి తోటలు సాగు
నడిగూడెం: నడిగూడెం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావనపురం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఎప్పటికప్పుడు పంట మార్పిడిని అవలంబిస్తూ భిన్న పంటలను సాగు చేస్తూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బృందావనపురం గ్రామానికి చెందిన చిన్న, సన్నకారు రైతులు పలువురు ప్రస్తుత సీజన్‌లో ముందుగా పెసర సాగు చేపట్టారు. ఆ పంట పూర్తవ్వగానే అర ఎకరం, ఎకరం విస్తీర్ణంలో బంతి సాగు చేపట్టారు. బంతి 120 నుంచి 140 రోజుల పంట కావడంతో.. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల నాటికి డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో బంతి సాగు చేపట్టారు.
ప్రైవేట్ హైబ్రిడ్‌లు, పొట్టి రకం, పొడవు రకం, ముద్ద రకం, పసుపు, నారింజ రకాలను సాగు చేశారు. నారును ఏపీలోని కృష్ణాజిల్లా చిల్లకల్లు ప్రాంతం నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. బంతి నారు నాటి రెండు నెలలు తర్వాత పూలు పూస్తాయి. బతుకమ్మ పండుగకు నడిగూడెం, బృందావనపురం, వేణుగోపాలపురం, కరివిరాల, చెన్నకేశ్వాపురం, వెంకట్రాంపురం, కాగితరామచంద్రాపురం, సిరిపురం, నారాయణపురం, శ్రీరంగాపురం, వల్లాపురం, చాకిరాల, రత్నవరం, రామాపురం గ్రామాలకు చెందిన ప్రజలు బృందావనపురం వచ్చి బంతి పూలు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం సీజన్ ఆరంభమవ్వడంతో కిలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు.
కనువిందు చేస్తున్న బంతి తోటలు
బృందావనపురం నుంచి కాగితరామచంద్రాపురం రహదారి వెంట పలు చోట్ల బంతి తోటలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ఎరుపు, పసుపు రంగుల్లో బంతి తోటలు కనిపిస్తుండడంతో పలువురు ప్రయాణికులు ఫొటోలు దిగుతున్నారు.
రెండేళ్లుగా బంతి సాగుచేస్తున్నా..
నాకున్న వ్యవసాయ భూమిలో గత రెండేళ్లుగా బంతి సాగు చేస్తున్నా. ఈ సారి భిన్నంగా మల్చింగ్ పద్ధతిలో సాగు చేపట్టాను. ఇప్పుడే సీజన్ ప్రారంభమైంది. కిలో బంతి పూలు రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నాం.
– చాపల సురేష్, యువ రైతు, బృందావనపురం
ప్రభుత్వం ప్రోత్సహించాలి
గత నాలుగేళ్లుగా పంట మార్పిడి అవలంబిస్తున్నా. మా లాంటి చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. విత్తనాలు, ఎరువులు పంపిణీ చేసి ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఒకే రకంగా కాకుండా పలు రకాలను సీజన్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నాను. మా ప్రాంత నేలలు కూడా అనుకూలంగా ఉన్నాయి.
– మేకపోతుల వెంకన్న, రైతు, బృందానపురం