
విహారయాత్రకు వెళ్తూ మృత్యు ఒడిలోకి..
శాలిగౌరారం: శాలిగౌరారం మండలం తిరుమలరాయినిగూడెం గ్రామానికి చెందిన యువకుడు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై విహారయాత్రకు వెళ్తూ వికారాబాద్ జిల్లా మన్నెగూడ మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం తిరుమలరాయినిగూడెం గ్రామానికి చెందిన నూనెముంతల సాయికుమార్(27) నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్‌లో గుండె స్టంట్ మిషన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం ఇంటి నుంచి విధులకు వెళ్లిన సాయికుమార్ సాయంత్రం విధులు ముగియగానే హైదరాబాద్‌లో చదువుకుంటున్న అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు అయితగోని శివమణి వద్దకు బైక్‌పై వెళ్లాడు. అక్కడి నుంచి వారిద్దరు కలిసి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు, వాటర్‌ఫాల్స్ చూసేందుకు బైక్‌పై రాత్రి బయల్దేరారు. మరో అరగంటలో అనంతగిరికి చేరుకుంటారనగా.. వారి బైక్‌ను వికారాబాద్ జిల్లా మన్నెగూడ మండలం కండ్లపల్లి గ్రామ పరిధిలో రాత్రి 11 గంటల సమయంలో గుర్తుతెలియని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న సాయికుమార్ అక్కడికక్కడే మృతిచెందగా.. శివమణి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంత సమయం తర్వాత శివమణి తేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే సాయికుమార్, శివమణి తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి వెళ్లారు. శివమణిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆదివారం సాయంత్రం సాయికుమార్ మృతదేహం తిరుమలరాయునిగూడెంకు చేరుకోగా రాత్రి అంత్యక్రియలు జరిగాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో నూనెముంతల శంకర్, యల్లమ్మ దంపతుల రోదనలు మిన్నంటాయి.
రోడ్డు ప్రమాదంలో శాలిగౌరారం
మండల యువకుడు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘటన