
యాదగిరిగుట్టలో యాదగిరి క్షేత్రం నమూనాలో ముస్తాబైన దుర్గాదేవి మండపం
వేడుకలకు ముస్తాబైన శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం
సిద్ధమైన మండపాలు
ఈ ఏడాది 11 రోజులు పూజలు అందుకోనున్న దుర్గాదేవి
యాదగిరిగుట్ట: దేవీ శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయాలు, ఊరూరా మండపాలు ముస్తాబయ్యాయి. సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలను మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి, వివిధ ఆకృతుల్లో అమ్మవార్లను ప్రతిష్ఠింపజేయడానికి సిద్ధమయ్యారు. భక్తులు దుర్గాదేవి మాలధారణ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
● ఈ సారి 11రోజుల పాటు ఉత్సవాలు..
ప్రతి ఏటా దేవీ శరన్నవరాత్రోత్సవాలు 9 రోజులు మాత్రమే జరుగుతుంటాయి. కానీ ఈ సారి 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. చవితి తిధి రెండు రోజులు వచ్చిన కారణంగా 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని అర్చకులు చెబుతున్నారు. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవిగా, 2వ రోజు గాయత్రీ దేవిగా, 3వ రోజు అన్నపూర్ణ దేవిగా, 4వ రోజు కాత్యాయని దేవిగా, 5వ రోజు మహాలక్ష్మిగా, 6వ రోజు లలితా త్రిపురసుందరి దేవిగా, 7వ రోజు మంగళచండీ దేవిగా, 8వ రోజు సరస్వతి దేవిగా, 9వ రోజు దుర్గాదేవిగా, 10వ రోజు మహిషాసురమర్ధినిగా, 11వ రోజు రాజరాజేశ్వరీ అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఆయా అమ్మవారి ఆలయాల్లో వారి వెసులుబాటును బట్టి అలంకారాలను చేస్తారు.
● యాదగిరి కొండపై..
యాదగిరి కొండపైన గల శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు సోమవారం ఉదయం శ్రీకారం అర్చకులు చుట్టనున్నారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులు రూ.1,116, ఒక్క రోజు సప్తశతి పారాయణం చేయుటకు రూ.116, లక్ష కుంకుమార్చనకు రూ.116 రుసుము చెల్లించి పూజల్లో పాల్గొనవచ్చునని ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా శివాలయంలో నిర్వహించే రుద్ర హోమాన్ని 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దుచేసినట్లు పేర్కొన్నారు.
● తూర్పు రాజగోపురం చెంత శమీ పూజ
ఆశ్వయుజ శుద్ధ దశమిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 5.30గంటల సమయంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారం యాదగిరీశుడి ఆలయ తూర్పు రాజగోపురం ముందు శమీ పూజ నిర్వహించనున్నారు.