
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బతుకమ్మలతో స్వాగతం పలుకుతున్న వైద్య సిబ్బంది
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోదాడ: కోదాడలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంబంధింత అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆదివారం రాత్రి ఆయన ఆస్పత్రి పనులను పరిశీలించి మాట్లాడారు. గతంలో ఉన్న పీహెచ్‌సీని 30 పడకల ఆస్పత్రిగా తానే మార్చానని, ఇప్పుడు వంద పడకల ఆస్పత్రిగా కూడా తాను మంత్రిగా ఉన్న సమయంలోనే మంజూరు చేయించానని అన్నారు.
రాష్ట్రంలో 3 సిటీ స్కాన్ యంత్రాలు మంజూరైతే రెండింటిని కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఏర్పాటు చేయించానన్నారు. సీటీ స్కాన్ యంత్రాల నిర్వహణకు అవసరమైన రేడియాలజిస్ట్‌లను, టెక్నిషియన్‌లను త్వరలో నియమిస్తామని అన్నారు. దీంతో పాటు కోదాడలో నవోదయ విద్యాలయంతో పాటు చిలుకూరులో యంగ్ ఇండియా స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలను అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్ధానంలో ఉంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. డయాలసిస్ పడకల సంఖ్యను పెంచడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మంత్రికి ఆస్పత్రి సిబ్బంది బతుకమ్మలతో స్వాగతం పలికారు.
అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోతె లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.244 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ లిఫ్ట్ ద్వారా మోతె, నడిగూడెం, మునగాల మండలాల్లో 46,712 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, ఇరిగేషన్ అధికారులు రమేష్‌బాబు, శివధర్మతేజ, ఆర్‌అండ్‌బీ సీఈ సీతారామయ్య, డీసీహెచ్‌ఎస్ వెంకటేశ్వర్లు, డాక్టర్ దశరథ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.