
సాగర్ చూసేందుకు వచ్చి వ్యక్తి గల్లంతు
నాగార్జునసాగర్:కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చిన వ్యక్తి కృష్ణా నదిలో గల్లంతయ్యాడు. ఈ ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చింతల్ ప్రాంతానికి చెందిన దిరిసెల రాంబాబు(45) ఫార్మా కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం అతడు తన భార్య సుహాసిని, ఇద్దరు కుమారులతో కలిసి నాగార్జునసాగర్ సందర్శనకు వచ్చారు. మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులతో కలిసి సాగర్ అందాలను తిలకిస్తూ, ఫొటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. అనంతరం స్నానాలు చేసేందుకు గాను సాగర్ డ్యాం దిగువన విద్యుదుత్పాదన కేంద్రానికి వెళ్లే దారిలోని శివాలయం పుష్కరఘాట్‌లోకి దిగారు. ఈ క్రమంలో రాంబాబు ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న భార్య, కుమారులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న సాగర్ ఎస్‌ఐ ముత్తయ్య ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆది వారం రాత్రి వరకు కూడా రాంబాబు ఆచూకీ లభించలేదు.