
చోరీకి గురైన వినికిడి యంత్రాలు
చౌటుప్పల్ : కన్న కూతురికి పుట్టుకతో చెవులు వినిపించవు. మాటలు కూడా రావు. ప్రస్తుతం ఐదేళ్ల వయస్సు ఉన్న ఆ చిన్నారి అవస్థలకు తల్లడిల్లిన తల్లిదండ్రులు గతేడాది ఆగస్టులో ఆపరేషన్ చేయించారు. అదేఏడాది అక్టోబర్ నెలలో చెవులకు ప్రత్యేక పరికరాన్ని అమర్చారు. దాంతో వినికిడి సమస్యకు పరిష్కారం దొరికింది. అదేవిధంగా నోటి మాటలను రప్పించేందుకు కూడా పడరానిపాట్లు పడుతున్నారు. స్వగ్రామం నుంచి నిత్యం హైదరాబాద్‌కు కూతురును తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ చిన్నారికి చెందిన వినికిడి యంత్రాలు బస్సులో చోరీకి గురయ్యాయి. దీంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన ఏరుకొండ నాగమణి తన కూతురు హాద్వికకు బుధవారం హైదరాబాద్‌లో థెరపీ చేయించి తిరిగి మధ్యాహ్నం 12.40కి దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన బస్సులో చౌటుప్పల్‌కు చేరుకుంది. ఇక్కడి నుంచి నల్లగొండ డిపో బస్సు పల్లెవెలుగు ద్వారా 2.00గంటల ప్రాంతంలో మునుగోడులో దిగింది. అటు నుంచి నేరుగా ఇంటికి వెళ్లి తన వెంట తీసుకెళ్లిన బ్యాగును పక్కన పెట్టింది. మరుసటి రోజు ఉదయం సమయంలో తనకు వినికిడి ఇబ్బంది అవుతోందని కూతురు చెప్పడంతో కూతురు చెవికి ఉన్న పరికరానికి చార్జింగ్ పెట్టేందుకుగాను బ్యాగులో ఉన్న బాక్స్‌ను తెచ్చేందుకు వెళ్లింది. బ్యాగులో బాక్స్ కన్పించకపోవడంతో ఇళ్లంతా వెతికినా ఎక్కడా లభ్యమవ్వలేదు. తాను ప్రయాణం చేసే క్రమంలో బ్యాగు నుంచి ఆ బ్యాక్స్ చోరీకి గురైందని ఆమె ఆలస్యంగా గుర్తించింది. దీంతో రెండు రోజులుగా కనిపించిన వారినందరినీ ఆరా తీస్తోంది. రూ.1.50లక్షల విలువ చేసే వినికిడి పరికరాలు ఎవరికై నా దొరికితే ఇవ్వాలని వేడుకుంటోంది.
ఫ రూ.1.50 లక్షల విలువ
ఉంటుందన్న బాధితురాలు