
సాకేందుకు పప్పీస్..!
నీలగిరి మున్సిపాలిటీలో కుక్కపిల్లల దత్తత
ఫ వీధి కుక్కలకు రేబిస్ టీకాలు
ఫ ఈ కార్యక్రమాలను 13నప్రారంభించనున్న మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ టూటౌన్ : జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్య పట్టణాలతో పాటు మండలాలు, గ్రామాల్లో కలిపి మొత్తం లక్ష వీధి కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క నల్లగొండ జిల్లా కేంద్రంలోనే వీధి కుక్కలు 20 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీధుల్లో తిరిగే కుక్క పిల్లలను దత్తతకు ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. మరోవైపు వీధి కుక్కలకు నిరంతరం రేబిస్ టీకాలు వేయాలని నిర్ణయించారు. నీలగిరి మున్సిపాలిటీ, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్ మున్సిపల్ పార్కులో ఈనెల 13న కుక్క పిల్లల దత్తత, కుక్కలకు నిరంతరం రేబిన్ టీకాల ప్రక్రియను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
దత్తతకు ముందుకొచ్చిన 25 మంది
నీలగిరి పట్టణంలో దత్తత ఇచ్చేందుకు 30 కుక్క పిల్లలను గుర్తించారు. కుక్క పిల్లలను దత్తత తీసుకోవడానికి జిల్లా అధికారులు 25 మంది ముందుకు వచ్చారు. దత్తత తీసుకున్న వారు వాటి బాగోగులు చూసుకోవడంతో పాటు సంతాన రహిత ఆపరేషన్లు చేయించనున్నారు. ఇది సక్సెస్ అయితే దత్తత తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
రేబిస్ టీకాలతో తప్పనున్న ప్రమాదం..
జిల్లా వ్యాప్తంగా ఇటీవల కుక్కల సమస్య జఠిలంగా మారుతున్న విషయం తెలిసిందే. వాటిని నివారించ వద్దని కోర్టు తీర్పు ఉండడంతో నీలగిరి మున్సిపాలిటీలో సంతాన రహిత ఆపరేషన్లు చేసి వదిలేస్తున్నారు. మిగతా చోట్ల సంతాన రహిత ఆపరేషన్లు చేసే మిషన్లు, సిబ్బంది లేని కారణంగా అక్కడ కుక్కల సంఖ్య భారీగా పెరుగుతోంది. దాంతో జిల్లా వ్యాప్తంగా లక్ష వరకు వీధి కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటన్నింటికీ ఒకేసారి సంతాన రహిత ఆపరేషన్లు చేయడం సాధ్యం కానందున కుక్కలకు రేబిన్ టీకాలు వేయనున్నారు. పొరపాటున కరిసినా కుక్కలకు రేబిన్ టీకా వేస్తున్నందున మనుషులకు ప్రమాదం తప్పనుంది.