
సైన్స్ సెమినార్లతో శాస్త్రవేత్తలుగా ఎదగవచ్చు
నల్లగొండ : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను సైన్స్ సెమినార్ ద్వారా తెలుసుకుని శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించుకుని బాలశాస్త్ర వేత్తలుగా ఎదగవచ్చని జిల్లా సైన్స్‌అధికారి వనం లక్ష్మిపతి పేర్కొన్నారు. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజికల్ మ్యూజియం బెంగళూరు, ఎస్‌ఈఆర్‌టీ ఆదేశాల మేరకు గురువారం డైట్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి సెమినార్‌లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో న్యాయ నిర్నేతలుగా శ్రీనివాసరెడ్డి, నాగార్జున పాల్గొన్నారు.
అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా అందరికీ విద్య
రామగిరి(నల్లగొండ) : అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా అందరికీ విద్య అందుబాటులో ఉందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ అన్నారు. నల్లగొండలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ ఉపయోగపడేలా యూనివర్సిటీలో అనేక వినూత్న కోర్సులు ఉన్నాయన్నారు. గోండు, కోయ, చెండు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు ఎలాంటి ఫీజు లేకుండా చదువుకునేందుకు యూనివర్సిటీ అవకాశం కల్పించిందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, కో ఆర్డినేటర్ సుంకరి రాజా రాం, డాక్టర్ బి.అనిల్‌కుమార్, నగేష్, పద్మ, విజయ, ఉస్మానబాష, నరేందర్, రామ్‌రెడ్డి, మల్లికార్జున్, వీరన్న, ధనుజ పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
నల్లగొండ టూటౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని గురువారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అన్ని మండలాల్లో సేవా పఖ్వాడా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని కోరారు. సమావేశంలో నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, పోతెపాక లింగస్వామి, వెంకన్న, విద్యాసాగర్‌రెడ్డి, శాగ విద్యాసాగర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నర్సింహ, మోహన్‌రెడ్డి, అనిత, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీగా ఇబ్రహీంపేట
హాలియా : హాలియా మున్సిపాలిటీలో విలీనమైన ఇబ్రహీంపేట గ్రామం తిరిగి గ్రామ పంచాయతీగా ఏర్పడింది. 2018లో హాలియా మున్సిపాలిటీలో ఇబ్రహీంపేట గ్రామాన్ని విలీనం చేశారు. ఇబ్రహీంపేట గ్రామ పంచాయతీ పరిధిలో అలీనగర్‌తో కలుపుకుని మొత్తం 3వేల జనాభా ఉంది. కాగా గతంలో ఇబ్రహీంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సాయి ప్రతాప్‌నగర్ కాలనీ హాలియా మున్సిపాలిటీలో యథాతధంగా కొనసాగుతుండగా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ ఇబ్రహీంపేటలో అలీనగర్ యథాతధంగా ఉండనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ రెండో సవరణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టగా బిల్లుపై గురువారం గవర్నర్ సంతకంతో గెజిట్ విడుదల చేయడంతో ఇబ్రహీంపేట నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు.