
గవర్నర్ పర్యటనకు సిద్ధం చేయాలి
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి ఈనెల 15న రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ హాజరుకానున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి ఆమె మహాత్మాగాంధీ యూనివర్సిటీని సందర్శించారు. గవర్నర్ పాల్గొనే స్నాతకోత్సవ వేధికను పరిశీలించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ రాక సందర్భంగా వివిధ శాఖల అధికారులు వారి బాధ్యతల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. అధికారులు ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆయా అంశాలను అందులో పర్యవేక్షించాలన్నారు. ఈనెల 15న ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ టీం, 108, 104, ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని, వేదిక వద్ద ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాట్లు చూడాలన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ గవర్నర్ వస్తున్న సందర్భంగా యూనివర్సిటీలో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాటు చేస్తామని, తనిఖీలు ఉంటాయని, గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే ఆ రోజు లోపలికి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యే వారి జాబితా ముందుగానే ఇవ్వాలని కోరారు. వైస్ ఛాన్స్‌లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ స్నాతకోత్సవం సవ్యంగా జరిగేందుకు 12 కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్, డీసీహెచ్‌ఎస్ మాతృనాయక్, ట్రాన్స్‌కో డీఈ నదీంఅహ్మద్, ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ ఎస్పీతో ఎంజీయూలో ఏర్పాట్ల పరిశీలన