
ఎర్రబారుతున్న పత్తిచేలు
మునుగోడు: ఆరుకాలం శ్రమించి పంటలు సాగుచేస్తున్న రైతులకు పంట చేతికొచ్చేదాకా నమ్మకం లేకుండా పోతోంది. ఈ ఏడాది భారీ వర్షాలు కురవకపోయినా మునుగోడు డివిజన్ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పత్తి పంట సాగు చేశారు. అడపాదడపా కురిసిన వర్షాలకు పత్తిచేలు ఏపుగా పెరిగాయి. దీంతో తాము ఆశించిన దిగుబడి వస్తుందని రైతన్నలు ఆనందపడుతున్న సమయంలోనే పత్తిచేలు ఎర్రబారుతూ ఆకులు రాలిపోతున్నాయి. చేలు ఎర్రబారకుండా ఉండేందుకు రకరకాల మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకుండా పోతోందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
1,56,104 ఎకరాల్లో పత్తి సాగు..
మునుగోడు డివిజన్‌లోని ఐదు మండలాల్లో ఈ ఏడాది రైతులు మొత్తం 1,56,104 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఇందులో మునుగోడు మండలంలో 39,657 ఎకరాలు, చండూరులో 31,408, మర్రిగూడ 23,940, నాంపల్లి 46,959, గట్టుప్పల్ మండల వ్యాప్తంగా 14,140 ఎకరాల్లో పత్తి సాగైంది. అయితే పంట ఎదుగుదలకు అవసరమైన రసాయన ఎరువులతోపాటు చీడపీడల నివారణ మందులు పిచికారీ చేశారు. దీంతో ఎప్పుడూలేనంతగా మొక్కలు బలంగా ఏపుగా పెరిగాయి.
ఎర్రనల్లి పురుగు బెడద
గత పదిహేను రోజుల కాలంగా పత్తిచేలపై ఎర్రనల్లి పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో మొక్కల ఆకులు వాడిపోయి చేలంతా ఎర్రబడి పోయి రోజురోజుకు ఆకులు రాలిపోతున్నాయి. దీని నివారణకు రైతులు ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు, వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం వారంలో ఒకటి, రెండు మార్లు మందుల పిచికారీ చేశారు. అయినా పంట మాత్రం అలాగే ఎర్రబారి కనిపిస్తోంది. తెగుళ్ల నివారణ కోసం మందులు పిచికారీ చేస్తే పెట్టుబడులు పెరుగుతున్నాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. సంబంధిత వ్యవసాయ అధికారులు ఎర్రబారుతున్న పత్తి పంటలని పరిశీలించి దాని నివారణ చర్యలకు తగిన సూచనలు ఇవ్వాలని మునుగోడు డివిజన్ రైతులు వేడుకుంటున్నారు.
గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది పత్తిపంట చేతికి రాకముందే ఎర్రబారిపోతోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఏ మాత్రం చేను పచ్చబడడం లేదు. దీంతో పత్తి మొక్కలు ఎండిపోయి పూత, పిందె రావడం లేదు. ఈ ఏడాది పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన సలహాలు ఇస్తే బాగుంటుంది.
– లింగారెడ్డి, రైతు, కొంపల్లి,
మునుగోడు మండలం
పదిహేను రోజులుగా వాతావరణంలో మార్పుల వల్ల వేడి పెరిగింది. దీంతో పత్తిచేలకు ఎర్రనల్లి పురుగుల బెడద ఎక్కువైంది. తద్వారా చేలు ఎర్రబారుతున్నాయి. ఎర్రనల్లి పురుగుల నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో స్పైరోమెసిఫెన్ 160 ఎంఎల్‌లు లేదా టోల్పెన్పైరాడ్ 300 ఎంఎల్‌లు లేదా అబామెక్టిన్ 200 ఎంఎల్‌లు ఏదైనా ఒక మందు పిచికారీ చేసుకోవాలి. వాతావరణం కాస్త చల్లబడితే ఎర్రనల్లి పూర్తిగా నశించిపోతుంది.
– బి.వేణుగోపాల్, ఏడీఏ, మునుగోడు డివిజన్
ఫ వాతావరణంలో మార్పులతో
ఎర్రనల్లి పురుగు ప్రభావం
ఫ పదిహేను రోజులుగా రాలుతున్న ఆకులు
ఫ మందులు పిచికారీ చేస్తున్నా ప్రయోజనం శూన్యం
ఫ ఆందోళనలో రైతులు