
రపాజెక్టుల పూర్తికి ప్రణాళికలు
నల్లగొండ ప్రాజెక్టులకు రూ.3వేల కోట్లు ఇవ్వాలి: కోమటిరెడ్డి
సాక్షిప్రతినిధి నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు రూట్‌మ్యాప్ రూపొందించామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల పునరుద్ధరణలో భాగంగా ఎయిర్‌బోర్న్ హెలికాప్టర్ సర్వే నిర్వహించబోతున్నామన్నారు. పనుల పునరుద్ధరణపై ఇంజనీర్లు రూపొందించిన నివేదికపై ఈ నెల 15న మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించిన తర్వాత పనులు పునఃప్రారంభిస్తామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని జలసౌధలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షించి మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం–1, పెండ్లిపాకల రిజర్వాయర్, సొరంగం–2ను పూర్తి చేసి 25 కి.మీ. ప్రధాన కాల్వ ద్వారా హైలెవల్ కాల్వకు నీళ్లను తరలించి సాగునీరు అందిస్తామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే హైలెవల్ కాల్వ కింద 2.2లక్షలు, ఉదయసముద్రం కింద లక్ష, లోలెవల్ కాల్వ కింద 80వేల ఎకరాలు కలిపి మొత్తం 4లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు మారుమూల గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఎనిమిది జలాశయాల కింద 3.61లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు పనులు కొనసాగుతున్నాయన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని ఏదుల రిజర్వాయర్ నుంచి దుందుభి వాగు వరకు నీళ్లను తరలించే ప్రాజెక్టు పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి చేపట్టామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11 ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, వీటితో 15వేల ఎకరాల స్థిరీకరణ, 14,506 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని కాల్వలను త్వరలో పూర్తిచేస్తామన్నారు. 93శాతం పూర్తయిన బస్వాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి 23వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గంధమల్ల రిజర్వాయర్ పరిధిలోని రావెల్ కోల్ లింక్ కెనాల్, ప్యాకేజ్–16, తుర్కపల్లి కెనాల్ పనులూ పూర్తి చేస్తామన్నారు.
చివరి దశ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి :గుత్తా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పుట్టంగండి, నెల్లికల్, పిలాయిపల్లి కెనాల్, ధర్మారెడ్డిపల్లి కాల్వతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులను వేగిరం చేసి త్వరగా పూర్తి చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. చివరి దశలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే పనులు పూర్తయి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి
ఫ బ్రాహ్మణవెల్లెంల, డిండి, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి, బునాదిగాని ప్రాజెక్టులూ పూర్తి చేస్తాం
ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై సమీక్షలో మంత్రి ఉత్తమ్
ఫ చివరి దశలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరిన గుత్తా
ఫ జిల్లాకు రూ.10వేల కోట్లు కేటాయించాలన్న మంత్రి కోమటిరెడ్డి
రూ.3వేల కోట్లు కేటాయిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్లోరెడ్ ప్రభావిత నార్కట్‌పల్లి మండలంలో చేపట్టిన బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు రూ.300 కోట్ల కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు, మునుగోడు, నార్కట్‌పల్లిలో వర్షాభావంతో నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. తాగు, సాగునీటి అవసరాలకు ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి బ్రాహ్మణవెల్లెంలకు క్రమం తప్పకుండా నీళ్లను పంపింగ్ చేయాలని కోరారు. పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లను పంపింగ్ చేయాలని ప్రతీసారి అధికారులకు చెప్పాలా? అని ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టులకు రివైజ్డ్ టెండర్లు వేసినా, ఈ ప్రాజెక్టుకు వేయలేదన్నారు. రైతులకు సాగునీటి సరఫరాకు పైప్‌లైన్ కోసం రూ.30లక్షల సొంత నిధులను ఖర్చు చేశానన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ జిల్లాకు చెందిన వారే కావడంతో ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరిగిందన్నారు. 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టును పదేళ్లు పక్కనపెట్టిందన్నారు. 2027 నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం, మంత్రి ఉత్తమ్ హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సాగర్ జలాలు చివరి ఆయకట్టు వరకు అందేలా ఎడమ కాల్వ లైనింగ్ కోసం టెండర్లను ఆహ్వానించడం పట్ల మంత్రి ఉత్తమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమీక్షలో జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ పాల్గొన్నారు.