
రైతు వేదికల్లోనూ యూరియా
నల్లగొండ అగ్రికల్చర్: యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెలరోజులుగా సహకార సంఘాలు, ఆగ్రో కేంద్రాలు, ఎండీసీఎంఎస్ సెంటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే బారులుదీరుతున్నారు. కొన్ని సెంటర్ల వద్ద రాత్రి అక్కడే నిద్రిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాలతోపాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న 36 రైతు వేదికల్లోనూ యూరియాను అందుబాటులో ఉంచి సహకార సంఘాల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో గురువారం నుంచి విక్రయించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లాకు రావాల్సిన యూరియా
12 వేల మెట్రిక్ టన్నులు
జిల్లాలోని 36 రైతు వేదికల ద్వారా యూరియా విక్రయించాలని ప్రణాళిక సిద్ధమైంది. అయితే వానాకాలం సీజన్‌కు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటి వరకు 58 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసింది. మరో 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ప్రస్తుతం నాన్ ఆయకట్టు ప్రాంతంలో వరి, పత్తికి యూరియా అంతగా అవసరం ఉండదు. కేవలం నాన్ ఆయకట్టు ప్రాంతంలో ఆలస్యంగా వరి నాట్లు వేయడం వల్ల అక్కడ వరిచేలకు యూరియా ఎక్కువ అవసరం ఉంటుంది. నాన్ ఆయకట్టు ప్రాంతంలో వరిచేలు ఈనే దశలో ఉండడంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కంకి దశలో ఉన్నాయి. అలాగే పత్తి చేలు కూడా కాయ దశలో ఉన్నందున నాన్ ఆయకట్టులో యూరియా వినియోగం అంతగా ఉండదు. అయినప్పటికీ ఆయకట్టుతో పాటు నాన్ ఆయకట్టు ప్రాంతంలో రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున బారులుదీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఉన్న అన్ని రైతు వేదికల్లోనూ యూరియా విక్రయించాలని నిర్ణయించింది. కాగా బుధవారం జిల్లాకు వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కానున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం పత్తిచేలకు యూరియా అవసరం లేనందున వరిచేలకు మాత్రమే రైతులు కొనుగోలు చేయాలి. నిల్వలు పెట్టుకున్నప్పటికీ యూరియా పాడైపోయే ప్రమాదం ఉంది. యూరియా దశల వారీగా రానున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ అవసరం మేరకు యూరియా అందజేస్తాం.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ
ఫ రేపటి నుంచి విక్రయించేందుకు ప్రణాళిక సిద్ధం
ఫ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశం
ఫ అన్ని ఏర్పాట్లు చేస్తున్న వ్యవసాయ శాఖ
ఫ జిల్లా వ్యాప్తంగా 36 రైతు వేదికలు